ఓటు వేస్తే నాప్ కిన్..కూల్ డ్రింక్ గిఫ్ట్

ఓటు వేయండి..ఓటు హక్కును ప్రజాస్వామ్య పటిష్టతకు పాటు పడండి..అంటూ ఎంత మంది చెప్పినా కొంతమంది ప్రజలు అస్సలు పట్టించుకోరు. ఓటుకు దూరంగా ఉంటున్నారు. దీంతో ఎన్నికల సంఘం వారికి అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోంది. అంతేగాకుండా వారిని ఆకర్షించి పోలింగ్ కేంద్రానికి వచ్చే విధంగా వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ముంబై శివారులోని మహిళలను ప్రోత్సాహించేందుకు ఎన్నికల అధికారులు వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు.
మహారాష్టలో 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 29వ తేదీన పోలింగ్ జరుగనుంది. ముంబై శివారు ప్రాంతాల్లో కొన్ని చోట్ల ‘మతదాన్ కేంద్ర’ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇవి కేవలం మహిళలకు మాత్రమే. ఇక్కడ ఓటు వేసేందుకు వచ్చిన వారికి బహుమతులు ఇస్తామని ఎన్నికల అధికారులు ప్రకటించారు. మహిళకు ‘శానిటరీ నాప్ కిన్’ ఇవ్వనున్నట్లు, ఓటు వేసేందుకు మహిళలను ప్రోత్సాహించడమే అంటున్నారు అధికారులు. సబర్బన్ ముంబై నియోజకవర్గంలోని 26 అసెంబ్లీ సెగ్మెంట్‌లో శక్తి మతదాన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు, ప్రతొక్క మహిళకు బహుమతులిస్తామని ఎన్నికల అధికారులు వెల్లడించారు. కూల్ డ్రింకులు కూడా సరఫరా చేస్తామన్నారు.