CJI N V Ramana : 5వ తరగతి విద్యార్థిని లేఖ..స్పందించిన సీజేఐ
కరోనా పరిస్థితులపై సుప్రీంకోర్టు తీసుకున్న చొరవను ప్రశంసిస్తూ కేరళలోని త్రిసూర్ కేంద్రీయ విద్యాలయంలో 5వ తరగతి చదువుతున్న లిద్వినా జోసెఫ్.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాసింది.

Cji N V Ramana
CJI N V Ramana కరోనా పరిస్థితులపై సుప్రీంకోర్టు తీసుకున్న చొరవను ప్రశంసిస్తూ కేరళలోని త్రిసూర్ కేంద్రీయ విద్యాలయంలో 5వ తరగతి చదువుతున్న లిద్వినా జోసెఫ్..భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాసింది. ఢిల్లీ సహా దేశంలో పలు ప్రాంతాల్లో కోవిడ్ మరణాలు చూసి చాలా బాధపడ్డానని ఆ లేఖలో లిద్వినా జోసెఫ్ పేర్కొంది.
కరోనా బాధితులకు ఆక్సిజన్ సరఫరా చేయమని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి వేలాది మంది ప్రాణాలను కాపాడినట్లు ఆ లేఖలో లిద్వినా జోసెఫ్ పేర్కొంది. ఢిల్లీలో కోవిడ్-19 మరణాల రేటు తగ్గడానికి కోర్టు ఇచ్చిన ఆదేశాలు దోహదపడ్డాయని అభిప్రాయపడింది. ఈ విషయంలో సుప్రీంకోర్టును చూస్తుంటే తనకు చాలా గర్వంగా ఉందని రాసుకొచ్చింది. ప్రజల ప్రాణాలు కాపాడిన సర్వోన్నత న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ లేఖకు ఒక ఆర్ట్‌ను జోడించి జస్టిస్ రమణకు పంపింది లిద్వినా జోసెఫ్.
లిద్వినా లేఖకి సీజేఐ నుంచి స్పందన వచింది. లిద్వినా జోసెఫ్ రాసిన అందమైన లేఖ, జడ్జిల పనితీరుపై హృదయానికి హత్తుకునేలా గీసిన డ్రాయింగ్ తాను అందుకున్నానని సీజేఐ తెలిపారు. దేశంలో జరుగుతున్న పరిణామాలను సదరు చిన్నారి గమనిస్తున్న తీరు, ప్రజల బాగోగులపై తనకున్న తపన చాలా ఆకట్టుకుందని చెప్పారు. చిన్న వయసులోనే సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవడం సంతోషకరమన్నారు. దేశ నిర్మాణంలో భాగమయ్యే ఒక బాధ్యతాయుతమైన, అప్రమత్తత కలిగిన పౌరురాలిగా ఆ చిన్నారి ఎదుగుతుందని తన శుభాశీస్సులు అందజేశారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి.