షిర్డీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ ఫైర్.. ఆలయాన్ని మూసివేస్తాం

  • Published By: madhu ,Published On : January 18, 2020 / 03:45 AM IST
షిర్డీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ ఫైర్.. ఆలయాన్ని మూసివేస్తాం

Updated On : January 18, 2020 / 3:45 AM IST

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో వివాదం మొదలైంది. షిర్డీలో కొలువైన సాయిబాబా జన్మస్థలంపై వివాదం ముదురుతోంది. ఆయన జన్మించింది పాథ్రీలోనేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించడంతో వివాదం రాజుకుంది. పర్బణి జిల్లాలోని పాథ్రీలోనే సాయిబాబా జన్మించారంటూ భావిస్తున్న అక్కడి స్థానికులు 1999లో సాయి జన్మస్థాన్‌ మందిరాన్ని నిర్మించారు. అప్పటినుంచి ఇక్కడికి భక్తుల రాక భారీగా పెరిగింది. వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.

దీంతో పాథ్రీని సాయిబాబా జన్మస్థలంగా అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం వంద కోట్ల రూపాయలు కేటాయిస్తామని సీఎం ప్రకటించారు. షిర్డీతో సమానంగా దీనిని కూడా అభివృద్ధి చేస్తామన్నారు. అదే ఇపుడు మహరాష్ట్ర రాజకీయాల్లో మంట పుట్టించింది. సీఎం నిర్ణయంపై షిర్డీలోని సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ భగ్గుమంది. సాయి మందిరాన్ని పాథ్రీకి తరలించాలని ప్రభుత్వం కుట్రచేస్తోందని ఆరోపించింది. పాథ్రీని అభివృద్ధి చేస్తే షిర్డీకి భక్తుల రాక తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకిస్తూ 2020, జనవరి 19వ తేదీ ఆదివారం నుంచి ఆలయాన్ని నిరవధికంగా మూసివేయనున్నట్టు ట్రస్ట్ ప్రకటించింది. బంద్‌కు కూడా పిలుపునిచ్చిన ట్రస్ట్… ఆలయంలోని అన్ని కార్యక్రమాలను నిలిపివేయనున్నట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు 2020, జనవరి 18వ తేదీ శనివారం షిర్డీ గ్రామస్థులంతా సమావేశం కానున్నారు. 

మరోవైపు.. ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ కూడా తీవ్రంగా తప్పుబట్టింది. సాయిబాబా జన్మస్థలంపై ఇంతవరకు వివాదం లేదని… కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే సాయి జన్మస్థల వివాదం తెరపైకి వచ్చిందని ఆరోపించింది. బాబా జన్మభూమిని ఏ రాజకీయ నాయకుడు నిర్ధారించలేడని…. ఇలాంటి తరహా రాజకీయంకొనసాగితే శిరిడీ వాసులు న్యాయ పోరాటం చేస్తారని హెచ్చరించారు. జన్మభూమి కన్నా కర్మభూమే గొప్పదంటున్నారు.

అయితే… బీజేపీ వాదనకు ఎన్సీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. సాయి జన్మస్థలంపై ఎలాంటి వివాదం అక్కర్లేదని… పాథ్రీ  జన్మస్థలమేనని నిరూపించేందుకు తగినన్ని ఆధారాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెప్పారు. బీజేపీ ఆరోపణలను కొట్టిపడేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ కూడా సమర్ధించింది. సాయి జన్మస్థాన్‌ మందిరానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడానికే నిధులు మంజూరు చేశారని… దీనిపై వివాదం సృష్టించి భక్తులకు సౌకర్యాలు అందకుండా చేయడం తగదన్నారు.

పర్బణి జిల్లాలోని పాథ్రీ అనే ఊరే సాయిబాబా జన్మస్థలమన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. షిరిడీకి ఇది 275 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1854లో 16 ఏళ్ల వయసులో సాయిబాబా షిరిడీకి వచ్చారని… ఇక్కడే తొలుత ఓ వేపచెట్టు కింద సాయిబాబా కనిపించారని భక్తులు చెబుతుంటారు. అయితే… సాయి జన్మస్థలం విషయంలో తెరపైకి వచ్చిన తాజా వివాదంతో భక్తుల్లో అయోమయం నెలకొంది. అయితే సాయిబాబా ఎక్కడా తన జన్మస్థలం గురించి చెప్పలేదని షిర్డీసాయిబాబా సంస్థాన్ ట్రస్ట్‌ సభ్యులు చెబుతున్నారు. పాథ్రీలో బాబా పుట్టారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అంటున్నారు.

Read More : మోడీ భారత పౌరుడేనా RTIలో దరఖాస్తు