సీఎంను తిడితే శిక్షే : రెచ్చిపోతున్న శివ సైనికులు

  • Published By: chvmurthy ,Published On : January 1, 2020 / 08:14 AM IST
సీఎంను తిడితే శిక్షే : రెచ్చిపోతున్న శివ సైనికులు

Updated On : January 1, 2020 / 8:14 AM IST

మహారాష్ట్రంలో శివసైనికులు  రెచ్చిపోతున్నారు. వాళ్లు అభిమానానికి హద్దుల్లేకుండా పోతోంది. సీఎం ఉద్ధవ్ ఠాక్రేను ఎవరైనా విమర్శిస్తే తట్టుకోలేక పోతున్నారు. ఉన్మాదంతో ఊగిపోతున్నారు.  రెచ్చిపోయి దాడులు చేస్తున్నారు. తాజాగా సీఎం ఉధ్ధవ్ ఠాక్రే ను విమర్శిస్తూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టిన ఒక వ్యక్తిపై  కోపోద్రిక్తురాలైన శివసైనికురాలైన ఓ మహిళా కార్యకర్త ఆయనపై ఇంకు చల్లిన ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో చోటు చేసుకుంది. 

మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఉద్ధవ్ ఠాక్రే అనర్హుడు, నాశనం చేసేవాడు అంటూ విమర్శిస్తూ బీడ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. సోషల్ మీడియాలో ఆ పోస్టు  చూసిన శివసేన మహిళా కార్యకర్త  కోపంతో  తీవ్ర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఇంకు చల్లింది. 

గత వారం ముంబై మహానగరంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరోక వ్యక్తికి శివసేన కార్యకర్తలు బలవంతంగా శిరోముండనం చేసి సంచలనం సృష్టించారు.  సీఎంను ఎవరైనా విమర్శిస్తే చాలు శివసైనికులు రెచ్చిపోయి దాడులకు దిగుతున్నారు.