జీవితకాల నిషేధమా? అటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేల్లో వణుకు.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే?
కేంద్ర సర్కారుతో పాటు ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

Supreme Court
నేరాలకు పాల్పడి దోషులుగా తేలిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై జీవితకాల నిషేధం విధించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. దీనిపై పరిశీలన చేస్తామని ఇవాళ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
దీంతో నేరాలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలు భవిష్యత్తులో ఆ పదవులను చేపట్టే అవకాశం ఉండకపోవచ్చు. దోషులుగా తేలిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై జీవితకాల నిషేధం విధించాలంటూ ఒకరు వేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపి, ఈ వ్యాఖ్యలు చేసింది.
దోషులుగా తేలిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై జీవితకాల నిషేధం విధించాలన్న దానిపై వేగవంతంగా నిర్ణయం తీసుకోవాలని వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. దోషులుగా తేలిన వారు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా చేయాలని అశ్వినీ ఉపాధ్యాయ్ 2016లో పిటిషన్ దాఖలు చేశారు.
Also Read: చిలుకూరు బాలాజీ అర్చకుడిపై దాడి.. ఉపేక్షించం.. వీరిని వదిలిపెట్టం: మంత్రి శ్రీధర్ బాబు
దీనిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం విచారణ కొనసాగించింది. అలాగే, అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా ఇచ్చిన రిపోర్టును కూడా న్యాయమూర్తులు పరిశీలించారు.
నిందితులు విచారణకు గైర్హాజరు అవుతుండడం, తరుచూ వాయిదాలు అడుగుతుండడంతో విచారణలో జాప్యం జరుగుతోందని ఆ రిపోర్టులో తెలిపారు. క్రిమినల్ కేసులు ఉన్నవారు ఉద్యోగంలో చేరేందుకు అనర్హులని, మరి ప్రజాప్రతినిధులుగా నేతలు ఎలా అర్హులవుతారని సుప్రీంకోర్టు చెప్పింది.
ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ.. హత్య లేదా అత్యాచారం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన క్లాస్ 4 ఉద్యోగి తిరిగి ఉద్యోగాన్ని పొందలేడని, మరి ఒక ఎంపీ లేదా ఎమ్మెల్యే మరోసారి పార్లమెంటు సభ్యుడు లేదా ఎమ్మెల్యే కావడం ఏంటని ప్రశ్నించింది.
అంతేగాక, అటువంటి వారు మంత్రులు అయ్యే అవకాశాలూ ఉన్నాయని చెప్పింది. కాబట్టి తాము ఆర్‌పీఏలోని సెక్షన్ 8, సెక్షన్ 9ని పరిశీలిస్తామని జస్టిస్ దీపంకర్ దత్తా చెప్పారు.
ఈ విషయంపై ఈసీ మరింత పరిశీలన చేయాలని తెలిపింది. తాము ఆదేశాలు ఇచ్చినా పలు రాష్ట్రాల్లో ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు కాకపోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కేంద్ర సర్కారుతో పాటు ఈసీకి నోటీసులు జారీ చేసింది. దీనిపై విచారణను వచ్చేనెల 4కు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.