Parliament Monsoon Session: మోదీ ప్రసంగానికి అడ్డుతగిలిన విపక్షాలు..ఉభయసభలు మరోసారి వాయిదా

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే..విపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఉభయ సభలు మరోసారి వాయిదా పడ్డాయి.

Parliament Monsoon Session: మోదీ ప్రసంగానికి అడ్డుతగిలిన విపక్షాలు..ఉభయసభలు మరోసారి వాయిదా

Modi (6)

Updated On : July 19, 2021 / 3:16 PM IST

Parliament Monsoon Session పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే..విపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఉభయ సభలు మరోసారి వాయిదా పడ్డాయి. లోక్ సభ మధ్యాహ్నాం 3:30 గంటల వరకు వాయిదా పడగా..రాజ్యసభ మధ్యాహ్నాం 3గంటల వరకు వాయిదా పడింది.

మొదట కొత్త కేంద్ర మంత్రులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్​సభకు పరిచయం చేస్తుండగా.. విపక్ష ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ప్రధాని ప్రసంగిస్తుండగా విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ఈ ఆందోళనల మధ్యే ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించారు. విపక్షాల నినాదాల మధ్యే మోదీ మాట్లాడుతూ.. చాలా మంది మహిళలు, దళితులు, ఆదివాసీలు.. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఓబీసీలు, గ్రామీణ, వ్యవసాయ నేపథ్యం ఉన్న వ్యక్తులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాం. దేశంలోని మహిళలు, ఓబీసీలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టడం పట్ల కొందరు వ్యక్తులు సంతోషంగా లేనట్టు కనిపిస్తోంది. అందుకే వారు మంత్రుల పరిచయ ప్రసంగాన్ని సైతం అడ్డుకుంటున్నారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.

మరోవైపు, రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్, అథ్లెట్ మిల్కా సింగ్ సహా ఈ ఏడాది మరణించిన ప్రముఖులకు సంతాపం తెలిపిన తర్వాత.. సభను గంటపాటు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. అనంతరం సమావేశమైన సభలో.. విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. నినాదాలు చేస్తూ వెల్​లోకి దూసుకెళ్లారు. దీంతో మరోసారి సభను వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు.

ఇవాళ రాజ్య‌స‌భ‌లోనూ విపక్షాల ఆందోళన మధ్యే మోదీ మాట్లాడారు. రైతు బిడ్డ‌ల్ని స‌భ‌లో ప‌రిచ‌యం చేసే శుభ‌సంద‌ర్భం ఇద‌ని, కానీ కొంద‌రు స‌భ్యులు దాన్ని అవ‌హేళ చేస్తున్న‌ట్లు ప్ర‌ధాని ఆరోపించారు. ద‌ళితుల వైభ‌వాన్ని ఎందుకు విప‌క్ష స‌భ్యులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అన్నారు. ఇదేం ర‌క‌మైన మాన‌సిక స‌మ‌స్యో అర్థం కావ‌డం లేద‌ని మోదీ అన్నారు. తొలిసారి స‌భ‌లో ఇలాంటి వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతుందని మోదీ తెలిపారు. వారి ప‌రిచ‌యాన్ని అడ్డుకోవ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు.