ఏపీ బీజేపీలో సోము వీర్రాజు సస్పెన్షన్ల గోల

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితుడయ్యారు. దూకుడుగా వ్యవహరిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తనదైన మార్కును చూపేందుకు తహతహలాడిపోతున్నారు. అమరావతి రాజధాని విషయంలో ఎవరైనా అనుకూలంగా మాట్లాడినా, బీజేపీ చర్యలపై అభిప్రాయాలను వ్యక్తం చేసినా వేటు వేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇందుకు తాజాగా జరుగుతున్న వరుస పరిణామాలపై పార్టీలోనూ జోరుగా చర్చ నడుస్తోంది. అమరావతిని రాజధానిగా టీడీపీ గతంలో ప్రకటించింది. శంకుస్థాపనకు స్వయంగా ప్రధాని మోడీ హాజరై.. ఢిల్లీని తలదన్నే రాజధానిగా చేస్తామని ప్రకటన చేశారు.
ఆ తర్వాత కేంద్రం కూడా నిధులు మంజూరు చేయడంతో.. హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయంతో పాటు, భారీ భవనాల నిర్మాణాలు మొదలుపెట్టారు. పేదల కోసం పక్కా ఇళ్లతో పాటు, న్యాయమూర్తులు, ఉద్యోగులు, కోసం ఫ్లాట్లు కూడా నిర్మించారు. అవన్నీ డెబ్బై శాతం పనులు పూర్తి చేసుకున్న అనంతరం ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అక్కడితో ఆగిపోయాయి. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన చేయడం చకచకా జరిగిపోయాయి. ఇక్కడి వరకు వైసీపీ వర్సెస్ టీడీపీ అన్న విధంగా నేతల ప్రకటనలు సాగాయి.
జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన, వామపక్షాలు, లోక్‌సత్తా, అమ్ ఆద్మీ.. ఇలా అన్ని పార్టీలు పూర్తిగా వ్యతిరేకించాయి. ఆనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ రాజధాని గ్రామాలలో పర్యటించి అమరావతే ఏపీ ఏకైక రాజధాని అని, రైతులకు అండగా బీజేపీ ఉంటుందని ప్రకటించారు. ఈ విషయంపై కేంద్రంతో కూడా మాట్లాడామని, సమయం వచ్చినప్పుడు కేంద్రం కూడా స్పందిస్తుందని తెలిపారు. ఈ ప్రకటనపై కూడా జీవీఎల్ నరసింహారావు వంటి వారు కేంద్రం జోక్యం ఉండదని, రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టమని పేర్కొనడంతో వివాదం మొదలైంది.
ఆనాడే కన్నా రాష్ట్ర అధ్యక్షుని హోదాలో తాను చేసిన ప్రకటనే ఫైనల్ అని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.. అంతే కాకుండా పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన వారికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. ఆ తర్వాత మూడు రాజధానుల బిల్లును చట్టవిరుద్దంగా వైసీపీ ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం పంపినప్పుడు కూడా కన్నా స్పందిస్తూ ఒకే రాజధానికి అనుకూలమంటూ లేఖ రాశారు. ఇదే సమయంలో ఎవరూ ఊహించని విధంగా… బీజేపీ అధ్యక్షునిగా కన్నాను తొలగిస్తూ.. సోము వీర్రాజును నియమించింది అధిష్టానం.
రాజధాని రైతులకు బీజేపీ అండగా ఉంటుందని, అమరావతే ఏకైక రాజధాని అని ఏపీలో ప్రకటన చేశారు సోము వీర్రాజు. కాకపోతే మరుసటి రోజు ఢిల్లీ నేతలను కలిసిన ఆయన 24 గంటల్లోనే మాట మార్చి… రాజధాని నిర్ణయం కేంద్ర పరిధిలో లేదని, అది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమంటూ.. జీవీఎల్ నోటి వెంట ఎప్పడూ వచ్చే వ్యాఖ్యలను వీర్రాజు కూడా వల్లించారు. రాజధాని రైతులకు నష్టం జరగకుండా ఉండేందుకు తమ వంతు పోరాటం చేస్తామని చెప్పారు. సోము వీర్రాజు చేసిన ఈ వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలే అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
మొన్నటి వరకు బీజేపీ రైతుల పక్షాన ఉంటుందని భావించిన అమరావతి ప్రజలకు కూడా బీజేపీ తత్త్వం బోధపడింది. బీజేపీ రైతాంగాన్ని మోసం చేసిందని ప్రజలే కాదు.. ఆ పార్టీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. నేరుగా వ్యతిరేకత వ్యక్తం చేయకుండా సందర్భానుసారం తమతమ అభిప్రాయాలను వివిధ రూపాలలో వ్యక్తపరిచారు. ఇదే అంశాన్ని అనుకూలంగా మార్చుకున్న సోము వీర్రాజు ఆయా నేతలపై సస్పెన్షన్ వేటు వేస్తూ అధిష్టానం దృష్టిలో పడేందుకు ఆరాటపడుతున్నారట.
తాజాగా ముగ్గురు ముఖ్యనేతలపై వీర్రాజు వేటు వేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వివిధ చానల్స్‌లో మీడియా చర్చల్లో పాల్గొన్న బీజేపీ నేతలు.. అమరావతికి అండగా ఉండాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని, అందుకు గతంలో జరిగిన సందర్భాలను కూడా గుర్తు చేశారు. వీటిని ఆసరాగా చేసుకున్న సోము వీర్రాజు కో-కన్వీనర్ సుబ్రహ్మణ్యం, విశాఖకి చెందిన శ్రీరాంలకు షోకాజ్ నోటీసులు ఇచ్చి.. శ్రీరాంను సస్పెండ్ చేశారు. రాజధాని విషయంలో ఎవరు నోరెత్తినా… బీజేపీని దోషిగా చూపినా… చర్యలు తప్పవని ఈ చర్యలతో హెచ్చరించినట్టు అయ్యిందంటున్నారు.
ఓపక్క దీనిపై చర్చ నడుస్తుండగానే సీనియర్ నాయకులు, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు రమణను కూడా సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు వీర్రాజు. రమణ ఆయన చేసిందల్లా ఓ పత్రికలో… రాజధానికి సంబంధించిన అంశంలో బీజేపీ పాత్ర, తర్వాత పరిణామాలు వంటి వాటిపై ఎడిటోరియల్ రాశారు. ఆయన చేసిన నేరం ఏమిటయ్యా అంటే.. రాజధాని విషయంలో గతంలో బీజేపీ అనుసరించిన వైఖరి, ఇప్పుడు మాట మార్చిన వైనం కారణంగా రాష్ట్రంలో బలపడుతున్న బీజేపీ.. మరోసారి బలహీనపడక తప్పదంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం. దీంతో పార్టీ లైన్ దాటారంటూ సస్పెషన్ వేటు వేయడంతో రమణ కూడా సోము వీర్రాజు వ్యవహార శైలిపై ఘాటుగానే స్పందించారు.
రమణ వంటి సీనియర్ నాయకుడ్ని అర్ధంతరంగా సస్పెండ్ చేయ పై బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకులు సైతం ఆశ్చర్యపోయారు. సోము వీర్రాజు వెనుక కొన్ని అదృశ్య శక్తులుండి నడిపిస్తున్నాయని, రాజధానిగా అమరావతిని చంపేసి, మూడు రాజధానుల దిశగానే అడుగులు వేసేలా వారి వ్యూహం ఉందని ఆ పార్టీ నేతలు ఆంతరంగిక సమావేశాల్లో చర్చించుకుంటున్నారట. ఇప్పుడు తాజా ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉన్న వెలగపూడి గోపాలకృష్ణను సస్పెండ్ చేస్తూ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఇదెందుకు చేశారా అని అడిగితే.. అమరావతికి అనుకూలంగా మాట్లాడారని, బీజేపీ స్టాండ్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ సస్పెన్షన్ లెటర్‌లో వివరించారు.
గత అధ్యక్షుడు కన్నాకు, అలానే టీడీపీకి కాస్త అనుకూలంగా ఉన్నారని భావించిన వారిపై వీర్రాజు తన వీరావేశం చూపిస్తున్నారనే టాక్ నడుస్తోంది. పార్టీ లైన్ దాటిన వాళ్ళపై చర్యలు తీసుకునే పేరుతో.. కన్నా వర్గాన్ని పదవుల నుంచి బయటకు పంపి, తన వారికి కట్టబెట్టాలనే వ్యూహాన్ని సోము వీర్రాజు అమలు చేస్తున్నారని పార్టీ నేతలు భావిస్తున్నారు. మరి ఇప్పుడు బీజేపీని తప్పుబడుతున్న వారిని బహిష్కరిస్తున్న సోము వీర్రాజు… గతంలో అమరావతే రాజధాని అని మాటలు చెప్పి.. ఇప్పుడు అధ్యక్షులు మారగానే సస్పెన్షన్లు చేయడం ఏంటని మండిపడుతున్నారు. మునుముందు మరెంత మంది సీనియర్ నాయకులకు బహిష్కరణ లేఖలు వెళతాయో వేచి చూడాలి అని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.