నమో వెంకటేశా : విద్యుత్ కాంతుల్లో వెలిగిపోతున్న తిరుమల కొండ

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. తిరుమల కొండ అంతా విద్యుత్ దీపాలతో వెలిగిపోతుంది. సాయంత్రం అయితే చాలు రంగు రంగుల విద్యుత్ దీపాలు, భారీ కటౌట్లతో కొండ అంతా కాంతులీనుతోంది. సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుమల GNC టోల్ గేట్ నుంచి మాడవీధుల వరకు రోడ్లకు ఇరువైపుల లైటింగ్ ఏర్పాటు చేశారు.
బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన గరుడ వాహన సేవకు రెండు లక్షల మంది తిలకించేలా ప్రత్యేకంగా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. 20 చోట్ల LCD స్క్రీన్లు, 9 వేల వాహనాల పార్కింగ్ కు ఏర్పాటు చేసినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరించారు. ఆలయ ధ్వజస్తంభం దగ్గర విద్యుత్ అలంకరణలు చేస్తున్నారు.
రెండురోజుల్లో ఆలయ ప్రాకారం, గోపురం, లోపలి భాగాల్లోని విద్యుత్ అలంకరణ పనులు పూర్తి చేయనున్నారు. 30వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతుండటంతో.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు అధికార యంత్రాంగం అంతా నిమగ్నం అయ్యింది.