Stampede in Temple: ఆలయంలో అపశ్రుతి.. తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి.. 30మందికిపైగా గాయాలు
ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకోవడంతో ఆరుగురు మృతి చెందారు. మరో 30మందికిపైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.

Lairai Devi temple
Stampede in Temple: గోవాలో విషాదం చోటు చేసుకుంది. శిర్‌గావ్ ప్రాంతంలోని శ్రీ లరాయ్ ఆలయంలో తొక్కిసలాట చోటుచేసుకోవడంతో ఆరుగురు మృతి చెందారు. మరో 30మందికిపైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
శ్రీ లరాయ్ ఆలయంలో శుక్రవారం నుంచి వార్షిక జాతర ప్రారంభమైంది. పార్వతీదేవి అవతారంగా భావించే లరాయ్ అమ్మవారిని దర్శించుకునేందుకు గోవాలోని నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రతీయేటా నిర్వహించే ఈ ఉత్సవాల్లో దొండాచీ యాత్ర ప్రధాన ఆకర్షణ. ఈ యాత్రలో భాగంగా ‘నిప్పులపై నడిచే’ ఆచారం అనాదిగా వస్తుంది. శనివారం తెల్లవారు జామున సమయంలో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఆరుగురు మరణించారు. పోలీసులు, స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. భారీ సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినా ఆలయ నిర్వాహకులు సరియైన భద్రత ఏర్పాటు చేయకపోవటం వల్లనే ఈ ఘటన జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నార్త్ గోవా డిస్ట్రిక్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పరామర్శించారు.