మా దగ్గరే చాలా ఉంది.. మాకు డబ్బు వద్దు: SBI

  • Published By: vamsi ,Published On : August 28, 2019 / 02:05 AM IST
మా దగ్గరే చాలా ఉంది.. మాకు డబ్బు వద్దు: SBI

Updated On : August 28, 2019 / 2:05 AM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ. 70వేల కోట్ల అదనపు మూలధన నిధులను విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన ప్రకటనపై ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI) స్పందించింది. తమ వద్ద సరిపడినదాని కంటే ఎక్కువే మూలధనం ఉందని, ప్రభుత్వం నుంచి ఎలాంటి అదనపు నిధులు అక్కర్లేదని స్పష్టం చేసింది.

నిధుల కోసం మేం ఎదురుచూడట్లేదని,  టైర్‌ 1, టైర్‌ 2 బాండ్‌లకు ప్రణాళికలను కూడా ప్రకటించేసినట్లు వెల్లడించింది. మూలధనం పెంచుకునేందుకు నాన్‌కోర్‌ ఆస్తులను కూడా అమ్మే ఆలోచనలో ఉన్నట్టు SBI తెలిపింది. తమకి ఇవ్వాలి అనుకుంటున్న మూలధన సాయంను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బ్యాంకులకు సాయంగా ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది SBI.

ఆర్థికంగా మందగమనంలో ఉన్న క్రమంలో కేంద్ర ఆర్థికశాఖ చేపట్టిన చర్యల్లో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.70వేల కోట్ల అదనపు మూలధన నిధులను విడుదల చేస్తామని, దీంతో మార్కెట్లో బ్యాంకు రుణ సామర్థ్యం రూ.5 లక్షల కోట్లకు పెరుగుతుందని నిర్మలా సీతారామన్‌ ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ అదనపు నిధులను విడతల వారీగా ఇవ్వాలని మొదట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే చిన్న వ్యాపారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిధులను ఒకేసారి విడుదల చేయాలనే ఆలోచనలో కేంద్రం ఉంది.