Stray Dogs: అన్ బిలీవబుల్..! నవజాత శిశువును రక్షించిన వీధి కుక్కలు.. రాత్రంతా శిశువుకు కాపలాగా..
ఇది నమ్మశక్యం కాదు. కుక్కలు దూకుడుగా లేవు. అవి శిశువుని కాపలా కాస్తున్నట్లుగా అప్రమత్తంగా, జాగ్రత్తగా కనిపించాయి
Stray Dogs: ఇది నమ్మశక్యం కాని ఘటన. కనీసం ఊహకు కూడా అందని ఇన్సిడెంట్. అన్ బిలీవబుల్ అనాల్సిందే. పిల్లలు కనిపిస్తే చాలు వారిపై దాడి చేసే వీధి కుక్కలు అనేకం. వీధి కుక్కల దాడిలో పిల్లలు తీవ్రంగా గాయపడిన ఘటనలు ఎన్నో. కొన్ని సందర్భాల్లో శునకాల దాడిలో ప్రాణాలు కూడా పోయాయి. అందుకే వీధి కుక్కలను చూస్తే అంతా భయపడిపోతున్నారు. అవి ఎక్కడ తమ పిల్లలపై దాడి చేస్తాయోనని హడలిపోతున్నారు. అయితే, ఇందుకు భిన్నంగా ఒక ఘటన జరిగింది. వీధి కుక్కలు ఓ నవజాత శిశువును కాపాడాయి. రాత్రంతా ఆ శిశువుకు కాపలాగా ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్‌లోని నవద్వీప్‌లో ఈ ఘటన జరిగింది. ఒక ఇంటి బయట వదిలివేయబడిన నవజాత శిశువుకు వీధి కుక్కల గుంపు రాత్రంతా కాపలాగా నిలబడింది. తెల్లవారుజామున సాయం అందే వరకు రాత్రంతా శిశువుకు రక్షణగా ఉన్నాయి వీధి కుక్కలు.
రైల్ కాలనీ ప్రాంతంలోని ఒక ఇంటి వెలుపల ఉన్న టాయిలెట్ సమీపంలో కొన్ని గంటల వయసున్న శిశువు కనిపించింది. అంతేకాదు శిశువు మీద రక్తం మరకలు కూడా ఉన్నాయి. అంటే పుట్టిన వెంటనే ఆ శిశువును వదిలివేసి ఉండొచ్చని తెలుస్తోంది.
శిశును చూడగానే మొరగడానికి లేదా పోరాడటానికి బదులుగా కుక్కల గుంపు శిశువు చుట్టూ ఒక వలయాన్ని ఏర్పరచాయి. దాదాపు రక్షణ కవచంలా. అవి రాత్రంతా అక్కడే ఉండిపోయాయి. ఎటూ కదల లేదు. ఎవరినీ శిశువు దగ్గరకు రానివ్వలేదు.
తెల్లవారుజామున శిశువును చూసిన మొదటి వ్యక్తులలో స్థానిక నివాసి సుక్లా మండల్ ఒకరు. “ఇది నమ్మశక్యం కాదు. కుక్కలు దూకుడుగా లేవు. అవి పిల్లవాడిని కాపలా కాస్తున్నట్లుగా అప్రమత్తంగా, జాగ్రత్తగా కనిపించాయి” అని తెలిపారు.
”తెల్లవారుజామున ఒక చిన్న ఏడుపు విన్నాను. దగ్గరలో ఉన్న ఏదో ఒక కుటుంబంలో అనారోగ్యంతో ఉన్న శిశువు ఉందని నేను అనుకున్నా. ఒక నవజాత శిశువు బయట పడి ఉందని, దాని చుట్టూ కుక్కలు నిలబడి ఉన్నాయని నేను ఎప్పుడూ ఊహించలేదు” అని మరో స్థానికుడు చెప్పారు.
సుక్లా నెమ్మదిగా శిశువు ఉన్న చోటుకి వెళ్లారు. అయితే, కుక్కలు ఏమీ అనలేదు. పక్కకు కదిలాయి. ఆ తర్వాత ఆమె తన దుప్పట్లో బిడ్డను చుట్టి సాయం కోసం పొరుగువారిని పిలిచింది. ఆ శిశువును మహేశ్‌గంజ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం చికిత్స కోసం కృష్ణనగర్ సదర్ ఆసుపత్రికి తరలించారు.
ఎలాంటి గాయాలు లేవని నిర్దారణ..
శిశువుకు ఎటువంటి గాయాలు లేవని డాక్టర్లు నిర్ధారించారు. శిశువుపై రక్తం ఎక్కువగా జనన ప్రక్రియ నుండి వచ్చి ఉండొచ్చన్నారు. స్థానిక ప్రాంతానికి చెందిన ఎవరైనా రాత్రి సమయంలో బిడ్డను వదిలి వెళ్లి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శిశువు దీర్ఘకాలిక సంరక్షణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
కొంతమంది వృద్ధులు ఈ సంఘటనను ఆధ్యాత్మిక చరిత్రతో ముడిపెట్టారు. 15వ శతాబ్దంలో నబద్వీప్‌లో జన్మించిన సాధువు శ్రీ చైతన్య మహాప్రభును ప్రస్తావించారు. ఆయన జీవుల పట్ల కరుణ, దయను బోధించారని గుర్తు చేశారు.
నవజాత శిశువును కుక్కల గుంపు కాపాడిన వైనం స్థానికులను అమితమైన ఆశ్చర్యానికి గురి చేసింది. దీన్ని వారు అస్సలు నమ్మలేకపోతున్నారు. ఇది నమ్మశక్యంగా లేదని అంటున్నారు. ఇదంతా దైవ లీల అని కొందరు అభిప్రాయపడ్డారు. కాగా, శిశువును కాపాడిన కుక్కలపై స్థానిక పిల్లలు ప్రేమ చూపించారు. వాటిని దగ్గరికి తీసుకుని బిస్కెట్లు తినిపించారు.
Also Read: గోల్డ్ మార్కెట్ దద్దరిల్లే జోస్యం.. బంగారం ధరలపై బాబా వంగా చెప్పిన 2026 మిస్టరీ లీక్..!
