అంతరిక్ష కేంద్రంలో ఆరోగ్య సమస్యలా? స్వయంగా ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన సునీతా విలియమ్స్
సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి స్వయంగా మాట్లాడారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ‘నాసా’ వ్యోమగామి సునీతా విలియమ్స్‌కు ఆరోగ్యపర సమస్యలు తలెత్తాయని ఇటీవల ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఆమెకు సంబంధించిన ఓ ఫొటో ఇటీవల బాగా వైరల్ అయింది. అందులో సునీతా విలియమ్స్ బరువు తగ్గినట్లుగా, ఆమె బుగ్గలు లోపలికి వెళ్లినట్లుగా కనపడడంతో చాలా మంది ఆందోళన చెందారు. దీనిపై సునీతా విలియమ్స్ క్లారిటీ ఇచ్చారు.
సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి స్వయంగా మాట్లాడారు. “నేను ఇక్కడకు వచ్చే సమయంలో ఎంత బరువుతో ఉన్నానో ఇప్పుడు కూడా అంతే బరువుతో ఉన్నాను” అని స్పష్టం చేశారు.
కండరాలు, ఎముకల సాంద్రతపై పడే మైక్రోగ్రావిటీ ప్రభావంతో పోరాడేందుకు తాము అంతరిక్ష కేంద్రంలో చేసే కఠినమైన వ్యాయామాల వల్లే తన శరీరంలో మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. ఎక్సర్‌సైజ్ బైక్, ట్రెడ్‌మిల్‌పై రన్నింగ్, వెయిట్‌లిఫ్టింగ్ వంటి వ్యాయామాలూ చేస్తామని అన్నారు.
అందుకే తన శరీరంలో మార్పులు వచ్చాయని తెలిపారు. తన తొడల భాగంలో బరువు పెరిగిందని, దీంతో బరువు తగ్గే వ్యాయామాలు తప్పకుండా చేస్తున్నానని చెప్పారు. కాగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎనిమిది రోజుల మిషన్ కోసం ఐఎస్‌ఎస్ వెళ్లిన సునీతా విలియమ్స్… ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు తిరిగి రాలేదన్న విషయం తెలిసిందే. బోయింగ్ స్టార్‌లైనర్ లో తలెత్తిన సాంకేతిక లోపాల వల్ల అక్కడే ఉండిపోయారు.
Toilet Time: టాయిలెట్‌లో అధిక సమయం కూర్చుంటున్నారా? ఈ అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయ్..