Supertech : సూపర్ టెక్‌కు సుప్రీం షాక్..ట్విన్ టవర్లు కూల్చివేయాలని ఆదేశం

ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సూపర్ టెక్‌కు సుప్రీం కోర్టు షాకిచ్చింది.

Supertech : సూపర్ టెక్‌కు సుప్రీం షాక్..ట్విన్ టవర్లు కూల్చివేయాలని ఆదేశం

Supertech

Updated On : August 31, 2021 / 3:14 PM IST

Supertech ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సూపర్ టెక్‌కు సుప్రీం కోర్టు షాకిచ్చింది. నోయిడాలో ఎమరాల్డ్ కోర్ట్ పేరుతో సూపర్ టెక్ కంపెనీ నిర్మించిన 40 అంత‌స్తుల ట్విన్ టవర్లను కూల్చివేయాలని 2014లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని మంగళవారం(ఆగస్టు-31,2021)సుప్రీంకోర్టు సమర్థించింది. టవర్ల నిర్మాణంలో సూపర్ టెక్ సంస్థ అవినీతి, అక్రమాలకు పాల్పడిందని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన సుప్రీం ధర్మాసనం తేల్చింది. యూపీ అపార్ట్‌మెంట్ యాక్ట్‌ను,ఫైర్ సేష్టీ రూల్స్ ని సూపర్ టెక్ ఉల్లంఘించిన‌ట్లు 140 పేజీల తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది.

నోయిడా అథారిటీ నుంచి ఎటువంటి పర్మిషన్ రాకముందే సూపర్‌‌టెక్ ఎమరాట్డ్‌ కోర్ట్ టవర్స్‌ నిర్మాణం మొదలుపెట్టేశారని, దీని గురించి తెలిసినా అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని ధర్మాసనం గుర్తించింది. నోయిడా అథారిటీ అధికారులు,బిల్డ‌ర్లు కుమ్మక్కయాయని ఇప్పటికే హైకోర్టు తేల్చిన విషయంలో వాస్తవం ఉందని పేర్కొంది. కామ‌న్ ఏరియాలో అక్ర‌మంగా ట్విన్ టవ‌ర్స్ నిర్మించిన‌ట్లు కోర్టు చెప్పింది.

ట్విన్ టవర్స్‌ను రెండు నెలల్లోగా కూల్చేయాలనిసుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ కూల్చివేతకు అయ్యే ఖర్చును కూడా సూపర్ టెక్ సంస్థే భరించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ టవర్స్‌లో ఫ్లాట్స్ కొనుగోలు చేసినవారికి కట్టిన డబ్బుతో పాటు 12 శాతం వడ్డీ కలిపి తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేష‌న్‌కు కూడా రెండు కోట్లు చెల్లించాల‌ని బిల్డ‌ర్ల‌కు కోర్టు ఆదేశించింది. టవర్ల కూల్చివేత సమయంలో ఇతర బిల్డింగ్స్‌కు ఎటువంటి డ్యామేజ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూపర్‌‌ టెక్‌ కంపెనీకి సూచించారు.

కాగా, బిల్డర్ నిర్మించిన ఈ ట్విన్ టవర్లు.. బుకింగ్ సమయంలో తమకు చూపిన అసలు ప్లాన్‌లో లేవని గృహ కొనుగోలుదారుల సంఘం ఆరోపిస్తూ 2014లో అలహాబాద్ హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో ఈ ట్విన్ టవర్ల నిర్మాణం అక్రమమని,నాలుగు నెలల్లోపు వీటిని కూల్చివేయాలని..ఈ బిల్డింగ్స్ లో అపార్ట్మెంట్లు కొనుగోలు చేసినవారికి డబ్బులు రీఫండ్ చేయాలని అలహాబాద్ హైకోర్టు ఏప్రిల్-11,2014న తీర్పునిచ్చింది. అయితే అలహాబాద్ హైకోర్టుని సవాల్ చేస్తూ..తాము ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదంటూ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది సూపర్ టెక్. దీనిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం ఆగస్టు-4,2021న తీర్పుని రిజర్వ్ లో ఉంచి..ఇవాళ టవర్లు కూల్చివేయాలంటూ అలహాబాద్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుని సమర్థించింది.

ఈ ట్విన్ టవర్స్ లో మొత్తం 915 అపార్ట్మెంట్లు మరియు 21 షాపులు ఉన్నాయి. ఇందులో 633 ఫ్లాట్లు ముందుగానే బుక్ అయ్యాయి. అయితే ప్రారంభంలో ఫ్లాట్‌లను బుక్ చేసుకున్న 633 మందిలో 133 మంది ఇతర ప్రాజెక్టులకు వెళ్లారని, 248 మంది రీఫండ్‌లు తీసుకున్నారని మరియు 252 మంది గృహ కొనుగోలుదారులు ఇప్పటికీ ప్రాజెక్ట్‌లో తమ బుకింగ్‌లను కలిగి ఉన్నారని బిల్డర్ చెప్పారు.