Article 370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశం

ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది.

Article 370: ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశం

Supreme Court

Supreme Court : జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయటం రాజ్యాంగబద్దమేనా అన్నదానిపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పును వెలువరించింది. వేరువేరు పిటీషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపి తీర్పును వెలువరించింది. తీర్పును సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ చదివి వినిపించారు. పిటీషనర్ల వాదనలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జమ్మూకశ్మీర్ పై కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాల్ చేయలేరని పేర్కొంటూ.. ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. పార్లమెంట్ నిర్ణయాన్ని కొట్టిపారేయలేం, కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Also Read : Alla Ramakrishna Reddy : ఎమ్మెల్యే పదవి, వైసీపీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా

ఆర్టికల్ 370 రద్దుపై ఏకాభిప్రాయంతో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఒకసారి భారతదేశంలో కలిసిపోయాక జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక సార్వభౌమాధికారం ఉండదని, జమ్ము కశ్మీర్ ను దేశంలో కలుపుకోవడానికి ఆర్టికల్ 370 ఉద్దేశమని, దేశం నుంచి వేరు చేయడానికి కాదని ధర్మాసనం పేర్కొంది. ఆర్టికల్ 370 తాత్కాలికమైనది మాత్రమేనని సుప్రీంకోర్టు తెలిపింది. అదేవిధంగా ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రపతికి ఉందని, జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి అంతర్గత సార్యభౌమాధికారం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. రాష్ట్రపతి పాలన అమలులో ఉన్నప్పుడు కేంద్రం నిర్ణయం తీసుకోవద్దన్న వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Also Read : Sabarimala : అయ్యప్ప మాలదారులకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న కేరళ సర్కార్

సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలి..
2024 సెప్టెంబరు 30వ తేదీలోగా జమ్మూకశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జమ్మూ కశ్మీర్ నుంచి లద్దాఖ్ ను విభజించి దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కశ్మీర్ లో రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా పునరుద్దరించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కశ్మీర్ అంతటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోమని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఇదిలాఉంటే జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హోదాను కల్పించే 370 ఆర్టికల్ ను కేంద్రం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జమ్మూ కశ్మీర్ కు చెందిన పలు పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ ఏడాది ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఇవాళ ధర్మాసనం తీర్పును వెలువరించింది.