రేషన్ కార్డు ఉంటే..రూ. 1000, చీర, పంచె

మీ దగ్గర రేషన్ కార్డు ఉందా..అయితే..మీకు రూ. 1000తో పాటు ఒక చీర, ఒక పంచె, కొంత సామాగ్రీ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా కానుక అందించాలని భావించింది. ఇందుకు బడ్జెట్ కూడా కేటాయించింది. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు లేండి. పొరుగున ఉన్న తమిళనాడు రాష్ట్రంలో. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయలు సంక్రాంతి కానుకగా అందించాలని నిర్ణయించింది. చీరలు, పంచెలు, పాయసం చేసుకొనేందుకు కావాల్సిన సామాగ్రీని పండుగ కానుకగా అందించనుంది అక్కడి రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను 2019, నవంబర్ 27వ తేదీ బుధవారం ఆమోదించింది.
గత సంవత్సరం విపరీమైన కరువుతో రాష్ట్రం అల్లాడిపోయిందని, రైతులు, ఇతర వర్గాలకు చెందిన ప్రజల బాధలను తగ్గించే ప్రయత్నంలో ఈ కానుక అందించనున్నట్లు సీఎం పళని స్వామి వెల్లడించారు. ప్రస్తుత సంవత్సరంలో భారీ వర్షాలు కురవడంతో తమ వద్దనున్న డబ్బులు వ్యవసాయ పనిముట్లు, ఇతర వాటి కోసం ఖర్చు చేశారని వివరించారు. జనవరి నెలలో వచ్చే పొంగల్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ప్రభుత్వం కోరుకొంటోందని, ఈ సంవత్సరం రేషన్ కార్డున్న వారికి నగదు, సరుకులు అందించాలని నిర్ణయించడం జరిగిందన్నారు.
కానుకలో రూ. 1000 నగదు, పండుగ రోజు నోరు తీపి చేసుకొనేందుకు పొంగల్ తయారీకి కావాల్సిన సామాగ్రీ రేషన్ దుకాణంలో ఉచితంగా ఇవ్వనున్నారు. గిఫ్ట్ ప్యాక్‌లో ఒక కిలో బియ్యం, కిలో చక్కెర, 20 గ్రాముల జీడిపప్పు, ఎండు ద్రాక్ష, 5 గ్రాముల యాలకులు ఉంటాయి. అంతేగాకుండా 2 అడుగుల పచ్చని చెరుకు గడ కూడా ఇవ్వనున్నారు. ఇందుకోసం రూ. 2 వేల 363 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం.
> సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాలే కాకుండా..ఇతర రాష్ట్రాలో కూడా ఘనంగా జరుపుకుంటారు.
> తమిళనాట నాలుగు రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజును భోగి పొంగల్, రెండో రోజును థాయ్ పొంగల్, మూడో రోజును మట్టు పొంగల్, నాలుగో రోజును కనుమ పొంగల్ అని పిలుస్తుంటారు.
> తమిళనాడులో జల్లి కట్టు ఉత్సవాలు జరుగుతుంటాయి. ఎద్దులు పరుగెత్తుతుంటే..వాటిని అదుపు చేసేందుకు..యువకులు పోటీ పడుతుంటారు.
> ఈ వేడుకను చూసేందుకు వేలాది మంది తరలివస్తుంటారు.
> పండుగ రోజున ప్రత్యేక వంటకం చేస్తారు. దీనిని పొంగల్ అని పిలుస్తారు. చేతికందిన పంట నుంచి సేకరించిన బియ్యాన్ని ఉడికంచి..తయారు చేసి ఈ వంటకం చేస్తారు.
Read More : ఈ ఏడాది శీతాకాలం వెచ్చగానే: వాతావరణ శాఖ అంచనా