ఘోర ప్రమాదం : 10మంది అయ్యప్ప భక్తులు దుర్మరణం

  • Published By: veegamteam ,Published On : January 6, 2019 / 11:44 AM IST
ఘోర ప్రమాదం : 10మంది అయ్యప్ప భక్తులు దుర్మరణం

Updated On : January 6, 2019 / 11:44 AM IST

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పుదుకొట్టై సమీపంలో కంటైనర్, వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న 11మంది చనిపోయారు. వారిలో 10మంది అయ్యప్ప భక్తులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. శబరిమల వెళ్లి… దర్శనం చేసుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతులంతా మెదక్‌ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.
తిరిగి వస్తుండగా:
వాహనంలో 15మంది అయ్యప్ప భక్తులు ఉన్నారు. మృతులను మెదక్ జిల్లా ఖాజీపేటకు చెందిన మహేష్, నాగరాజు, కుమార్, శ్యామ్, ప్రవీణ్, కృష్ణసాయి, ఆంజనేయులుగా గుర్తించారు. 2019 జనవరి 5 ఉదయం శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మధురై వెళ్లి మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి సొంతూరికి బయలుదేరారు. పుదుకొట్టై దగ్గర యాక్సిడెంట్ జరిగింది. మృతుల్లో వ్యాన్ డ్రైవర్ కూడా ఉన్నాడు. గాయపడిన వారిని స్థానికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అతివేగమే కారణం:
మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నాడా? లేక ఎదురుగా వస్తున్న వాహనాన్ని అంచనా వేయలేకపోయాడా? అనేది తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నారు. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్‌గా మారిందని స్థానికులు చెప్పారు. నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. జాతీయ రహదారి కావడంతో వాహనాలన్నీ మితిమీరిన వేగంతో వస్తుంటాయని, ఈ క్రమంలోనే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.