Tejas Express Train : తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు 2గంటలు ఆలస్యం.. రూ.4.5లక్షల పరిహారం
దేశంలోనే తొలి ప్రైవేటు రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించి IRCTC తాజాగా కీలక ప్రకటన చేసింది. తేజస్ ఎక్స్ ప్రెస్ రైలు ఆలస్యంగా వచ్చినందుకు నాలుగున్నర లక్షల పరిహారం చెల్లించనుంది.

Tejas Express (1)
Tejas Express train delayed : వందలాది మంది ప్రయాణికులు ఫ్లాట్ ఫారంపై ఎదురు చూస్తుంటారు. టైమ్ దాటిపోయినా రైలు ఎంతకీ రాదు. ఎందుకు ఆలస్యమైందో ఎవరూ చెప్పరు. అదే రైలు ప్రైవేటు వాళ్లదైతే.. ఆలస్యానికి చింతనతో పాటు ప్రయాణికులకు పరిహారం కూడా ఇస్తున్నారిప్పుడు. దేశంలోనే తొలి ప్రైవేటు రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించి IRCTC తాజాగా కీలక ప్రకటన చేసింది.
తేజస్ ఎక్స్ ప్రెస్ రైలు ఆలస్యంగా వచ్చినందుకు IRCTC ఏకంగా నాలుగున్నర లక్షల పరిహారం చెల్లించనుంది. ఢిల్లీ – లక్నో మధ్య నడిచే ఈ రైలు శని, ఆదివారాల్లో రెండున్నర గంటలు ఆలస్యమైంది. ఇండియాలో తొలిసారిగా ఓ రైలు ఆలస్యమైతే పరిహారం చెల్లించే నిబంధన తేజస్ ఎక్స్‌ప్రెస్ విషయంలో ఉంది.
రైలు గంట ఆలస్యమైతే 100 రూపాయలు, రెండు గంటలు, అంతకంటే ఎక్కువైతే 250 రూపాయల పరిహారం ప్రయాణికుడికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు శనివారం తేజస్ ఎక్స్‌ప్రెస్ ఆలస్యమైనందుకు అందులోని 1,574 మంది ప్రయాణికులకు రూ.250 చొప్పున మొత్తం 3 లక్షల 93 వేలు, ఆదివారం ఆలస్యమైనందుకు 561 మంది ప్రయాణికులకు రూ.150 చొప్పున IRCTC పరిహారం చెల్లిస్తుంది.
విమానం లాంటి వసతులతో తొలి తేజస్ ఎక్స్‌ప్రెస్ 2019, ఆగస్ట్ 4న లక్నో నుంచి ఢిల్లీ వెళ్లింది. ఈ రెండేళ్ల కాలంలో గంటలోపు రైలు ఆలస్యమైన సందర్భాలు ఐదుసార్లు మాత్రమే ఉన్నాయి. 99.9 శాతం ఈ రైలు ఆలస్యం కాదని IRCTC చెబుతోంది. రెండేళ్ల కాలంలో IRCTC ఇంత భారీ మొత్తంలో పరిహారం చెల్లించాల్సి రావడం ఇదే తొలిసారి.