ఒంటిపై ఉన్న చీరలను అందించి నీళ్లల్లో కొట్టుకుపోతున్న యువకులను కాపాడారు

కరోనా భయంతో ఇంటి మనిషినే పరాయిగా చూస్తోన్న ఈ రోజుల్లో ఓ ముగ్గురు మహిళలు.. యువకుల ప్రాణాలు కాపాడారు. నీళ్లల్లో కొట్టుకుపోతున్న యువకులను కాపాడేందుకు ఒంటిపై ఉన్న చీరలను అందించి అమ్మగా మారి వారికి పునర్జన్మ ఇచ్చారు. తమిళనాడులో ఆగస్టు 6న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భారీ వర్షాల కారణంగా పెరంబళూర్ జిల్లాలోని కొట్టారై డ్యామ్ నీటి మట్టం పెరిగింది. శిరువాచూర్ కు చెందిన 12 మంది యువకులు ఆ డ్యామ్‌కు సమీపంలోనే క్రికెట్ ఆడుకునేందుకు వెళ్లారు. క్రికెట్ ఆడిన అనంతరం యువకులు ఆ డ్యామ్‌లో స్నానాలు చేసేందుకు వెళ్లగా అక్కడున్న ముగ్గురు మహిళలు వారిని హెచ్చరించారు.
ఇంతలో నలుగురు యువకులు ప్రమాదవశాత్తూ డ్యామ్‌లో పడిపోయారు. దీంతో వారిని రక్షించేందుకు ప్రయత్నించగా.. అక్కడ తాడు వంటిది కనిపించలేదు. మరోవైపు వాళ్లు నీళ్లలో మునిగిపోతుండటంతో మహిళలు వారి ఒంటిపై ఉన్న చీరలను తీసి డ్యామ్‌లో ఉన్న యువకులకు అందించారు.
దీంతో ఇద్దరి కుర్రాళ్ల ప్రాణాలు కాపాడగలిగారు. కానీ మరో ఇద్దరు జలసమాధి అయ్యారు. ప్రమాదం నుంచి బయటపడిన ఇద్దరిని కార్తిక్, సెంతిల్వెలన్‌గా గుర్తించారు. మృతి చెందిన వారిని పవిత్రన్, రంజిత్‌లుగా గుర్తించారు.