Tamilnadu Governor : మరోసారి వివాదాస్పదంగా తమిళనాడు గవర్నర్ తీరు.. ఏం జరిగిందో తెలుసా?
తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది.
తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రారంభ ప్రసంగం చదవకుండానే అసెంబ్లీ నుంచి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. తొలి నుంచీ బిల్లుల విషయంలో డీఎంకే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ వస్తున్న గవర్నర్.. తాజాగా ప్రసంగం విషయంలోనూ అదే ధోరణి అవలంభించారు. మనస్సాక్షికి వ్యతిరేకంగా ప్రసంగం చేయలేనంటూ వ్యాఖ్యానించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తమిళనాట పాలకపక్షం, గవర్నర్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సోమవారం తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాసనసభకు వచ్చిన గవర్నర్ ఆర్.ఎన్.రవి ప్రారంభ ప్రసంగం చేసేందుకు నిరాకరించారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగంలోని చాలా అంశాలతో అంగీకరించలేని తాను.. వాటిని చదవడం ద్వారా రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్లు అవుతుందన్నారు. జాతీయ గీతాన్ని ప్రభుత్వం గౌరవించలేదని ఆరోపిస్తూ నిమిషాల వ్యవధిలోనే సభ నుంచి వెళ్లిపోయారు గవర్నర్.
అయితే.. తమిళనాడులోని అధికార డీఎంకే, గవర్నర్ రవి మధ్య చాలాకాలంగా విభేదాలున్నాయి. బిల్లుల విషయంలో గవర్నర్ ధోరణిని తప్పుపడుతూ ప్రభుత్వం ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలోనే వారి మధ్య విభేదాలు మరింతగా ముదిరాయి. 2020 నుంచి రాజ్‌భవన్‌కు పంపించిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ వాయిదా వేస్తున్నారని డీఎంకే ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు.. మూడేళ్లుగా బిల్లులు పాస్ చేయకుండా గవర్నర్ ఏంచేస్తున్నారని ప్రశ్నించింది న్యాయస్థానం.
Sonia Gandhi: సంచలన నిర్ణయం తీసుకున్న సోనియా గాంధీ
ఆ తర్వాత మరోసారి అసెంబ్లీ బిల్లులు ఆమోదించి.. రాజ్‌భవన్‌కు పంపించింది. వాటిని గవర్నర్ రవి రాష్ట్రపతికి సిఫారసు చేశారు. ఈ విషయంలోనూ సుప్రీంకోర్టు గవర్నర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండోసారి అమోదించిన బిల్లులును రాష్ట్రపతికి ఎలా పంపిస్తారని ప్రశ్నించిన న్యాయస్థానం.. ఈ విషయంలో నెలకొన్న ప్రతిష్ఠంభనను తొలగించేందుకు సీఎం స్టాలిన్‌తో సమావేశం కావాలని సూచించింది.
ఈ క్రమంలోనే మంత్రి పొన్ముడి విషయంలోనూ గవర్నర్-ప్రభుత్వం మధ్య మరో వివాదం చెలరేగింది. అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పొన్ముడిని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు గవర్నర్ రవి. ఓవైపు బిల్లుల కేసు సుప్రీంకోర్టులో కొనసాగుతుండగానే.. మంత్రి విషయంలో గవర్నర్ చేసిన డిమాండ్‌పై స్టాలిన్ సర్కారు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అయితే.. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా గవర్నర్ ఇలా చేయడం ఇది రెండోసారి. గత ఏడాది కూడా ప్రభుత్వం సిద్ధం చేసి ఆమోదం పొందిన ప్రసంగంలోని కొన్ని భాగాలను మినహాయించడమే కాకుండా.. సొంతంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాన్ని మర్చిపోకపోముందే.. తాజాగా మరోసారి ప్రసంగం విషయంలో వివాదం చెలరేగడం చర్చనీయాంశంగా మారింది.