లవ్ జీహాద్ చట్టాలు..యూపీ,ఉత్తరాఖండ్ ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు

Up Uttarakhand:లవ్ జిహాద్ అడ్డుకునేందుకని ఇటీవల పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు కఠిన చట్టాలు తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఆ చట్టాలను ప్రశ్నిస్తూ పిల్ దాఖలైంది. సెక్యూలర్ భావాలకు విరుద్ధంగా లవ్ జిహాద్ చట్టాలు ఉన్నాయని, వాటిని వెంటనే రద్దు చేయాలని..’సిటిజన్ ఫర్ జస్టిస్ అండ్ పీస్’ ఎన్జీఓ, న్యాయవాది విశాల్ ఠాక్రేతో పాటు పలువురు దాఖలు చేసిన వ్యాజ్యాలపై ఇవాళ అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. మత మార్పిడి నిరోధక చట్టం చెల్లుతుందో లేదో పరిశీలించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.
లవ్ జిహాద్ చట్టాలకు రాజ్యాంగబద్దత ఉందా లేదా అన్న కోణంలో తాము విచారణ చేపట్టనున్నట్లు సీజేఐ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం చెప్పింది. సంబంధిత వ్యాజ్యాలపై ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా స్పందించాలని స్పష్టం చేసింది. అయితే ఈ చట్టంలోని వివాదాస్పద నిబంధనలపై స్టే విధించేందుకు మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆయా రాష్ట్రాల వాదనలు వినకుండా చట్టంలోని నిబంధనలపై స్టే విధించలేమని పిటిషనర్లకు తెలిపింది.
కాగా, ముస్లిం యువకులు అక్రమపద్ధతిలో హిందూమత యువతుల్ని పెళ్లి చేసుకుంటున్నారని, లవ్ జిహాద్ పేరుతో ఆ కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుని, మతం మారుస్తున్నారని కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూపీ,ఉత్తరాఖండ్,మధ్యప్రదేశ్ సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా చట్టం చేశాయి. ఈ చట్టం కింద లవ్ జీహాద్ కి పాల్పడినవాళ్లకు 10ఏళ్ల జైలు మరియు భారీ జరిమానా వంటి కఠినశిక్షలు విధించనున్నారు. అయితే లవ్ జిహాదీ చట్టాలకు సంబంధించి మరో నాలుగు వారాల్లో విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం వెల్లడించింది.