మణిపూర్‌లో పతనం దిశగా బీజేపీ ప్రభుత్వం

  • Published By: vamsi ,Published On : June 18, 2020 / 05:54 AM IST
మణిపూర్‌లో పతనం దిశగా బీజేపీ ప్రభుత్వం

Updated On : June 18, 2020 / 5:54 AM IST

మణిపూర్‌లో మూడేళ్ల బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం సంక్షోభంలో పడింది. ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరగా.. మరో ఆరుగురు మద్దతు ఉపసంహరించుకున్నారు. నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్‌పీపీ) నుంచి నలుగురు , తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఒకరు, ఇండిపెండెంట్‌లు కూడా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వనుండడంతో బీరేన్‌ ప్రభుత్వం శాసనసభలో మైనార్టీలో పడింది. 

బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు సుభాష్‌చంద్ర సింగ్, టిటి హౌకిప్, శామ్యూల్ జెండాయ్‌లు రాజీనామా చేయగా.. విశ్వాసపరీక్ష కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో మణిపూర్‌లోని కాంగ్రెస్.. గవర్నర్‌ను కలవడానికి సిద్దమైంది. అయితే రాష్ట్ర పరిశ్రమల మంత్రి బిస్వాజిత్ సింగ్ మాత్రం “ప్రభుత్వానికి ఎటువంటి ముప్పులేదు” అని చెప్పారు. 

రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి నింగోంబం బుపెండా మీటీ మాట్లాడుతూ.. భారతదేశంలో బిజెపి పాలన పతనానికి ప్రారంభం ఈ రోజు మణిపూర్‌లోని ఇంఫాల్‌లో జరుగుతోంది. అతి త్వరలో, మణిపూర్‌లో కొత్త కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రజా ప్రభుత్వం ఏర్పడనుంది. ఓక్రామ్ ఇబోబి సింగ్ మణిపూర్ కొత్త సిఎం అవుతారనే నమ్మకం తనకు ఉందని ఆయన అన్నారు. 

బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ) బీరేన్‌ ప్రభుత్వంలో తమ పార్టీకి చెందిన నలుగురు మంత్రుల చేత రాజీనామా చేయించింది. వీరిలో డిప్యూటీ సీఎం జోయ్‌ కుమార్‌ సింగ్‌ కూడా ఉన్నారు. మరోవైపు బీజేపీ సర్కార్‌కు మద్దతు ఇస్తున్న మరో నలుగురు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలు కూడా దోస్తీకి గుడ్‌బై చెప్పారు.

2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకు కాగా 28 సీట్లలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. అయితే సభలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌ కంటే 21 స్థానాలు గెలిచిన బీజేపీ ఇతరులను తమవైపు లాక్కుని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే లేటెస్ట్‌గా జరిగిన రాజీనామాలతో బీజేపీ సభ్యుల సంఖ్య 19కి పడిపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. 

Read: పానీపూరీని నిషేధించిన అధికారులు..