మత స్వేచ్ఛపై మోడీతో కలిసి ట్రంప్ మాట్లాడతారంట!

అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో మత స్వేచ్ఛపై మాట్లాడనున్నట్లు సమాచారం. CAA, NRC, NCPలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న తరుణంలో ఈ అంశంపై మాట్లాడటం శోచనీయమే. సోమవారం నాటికి భారత్‌కు రానున్న ట్రంప్ దంపతులు.. భారత ప్రజాస్వామ్య పద్ధతులపై, సంస్కరణలపై ప్రగాఢ నమ్మకం ఉన్నట్లు వైట్ హౌజ్ వేదికగా శుక్రవారం జరిగిన సభలో చెప్పారు.
‘ప్రెసిడెంట్ ట్రంప్.. ప్రజాస్వామ్య సంప్రదాయాలు, మత స్వేచ్ఛ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు.. తాను వ్యక్తిగతంగా ఎలా ఫీలవుతున్నారోననే దానిపై స్పందించనున్నారు. ప్రత్యేకించి మత స్వేచ్ఛపై మాట్లాడేందుకు ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుత అడ్మినిస్ట్రేషన్‌కు దీనిపై మాట్లాడటం చాలా కీలకం’ అని అధికార ప్రతినిధి సమావేశంలో తెలిపారు.
సీఏఏ, ఎన్నార్సీ, ఎన్సీపీలపై మాట్లాడతారా అనే ప్రశ్నకు బదులిస్తూ ఇలా మాట్లాడారు. ‘భారత సార్వత్రిక విలువలపై మాకు అమితమైన గౌరవం ఉంది. భారత పద్ధతులను ఇలాగే కొనసాగిస్తాం. ఇక్కడ అన్ని మతాలను ఒకే రకంగా ఆదరిస్తారు. ట్రంప్ కూడా ఈ అంశాలపైనే మాట్లాడతారు’ అని అధికార ప్రతినిధి వెల్లడించారు.