పట్టాలు తప్పిన రైలు.. రెండు బోగీల్లో 155మంది!

పట్టాలు తప్పిన రైలు.. రెండు బోగీల్లో 155మంది!

Updated On : January 18, 2021 / 12:13 PM IST

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అమృత్‌స‌ర్ నుంచి జ‌య‌న‌గ‌ర్ వెళ్తున్న అమృత్‌సర్-జయనగర్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు బోగీలు సోమవారం(18 జనవరి 2021) లక్నో సమీపంలో పట్టాలు తప్పాయి. ప్ర‌మాద‌వ‌శాత్తు ల‌క్నో డివిజ‌న్‌లోని చార్‌బాగ్ స్టేష‌న్ వ‌ద్ద రైలు ప‌ట్టాలు త‌ప్ప‌గా.. ప్ర‌యాణికులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యారు. వెంటనే ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకున్న రైల్వే అధికారులు ప‌రిస్థితిని స‌మీక్షించారు.

రైలులోని రెండు బోగీలు ప‌ట్టాలు త‌ప్పాయ‌ని, వాటిలో 155 మంది ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. ప్ర‌యాణికుల‌కు ఎలాంటి గాయాలు కాలేద‌ని, ప్ర‌మాద ఘ‌ట‌న‌కు గ‌ల కార‌ణాల‌పై విచార‌ణ‌కు క‌మిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు అధికారులు వెల్లడించారు.

స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నంబర్ వన్ నుంచి బయలుదేరిన తరువాత రైలు పట్టాలు తప్పిందని, ఉత్తర రైల్వే ప్రతినిధి దీపక్ కుమార్ తెలిపారు. ఒక కోచ్‌లోని అన్నీ చక్రాలు పట్టాలు తప్పగా, మరొక కోచ్ ఒక చక్రం పట్టాలు తప్పిందని చెప్పారు.