ఏకగ్రీవ ఎన్నిక: ఠాక్రే ఫ్యామిలీ నుంచి తొలి సీఎంగా ఉద్ధవ్

మహారాష్ట్ర సీఎంగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పేరును కూటమి పార్టీలన్నీ ఏకగ్రీవంగా తీర్మానించాయి. కూటమి తరపున నేతగా మూడు పార్టీల ఎమ్మెల్యేలు ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకున్నారు. అసెంబ్లీలో బుధవారం (నవంబర్ 27, 2019) నిర్వహించే బలపరీక్షలో బీజేపీ సహా ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన పార్టీలన్నీ బలబలాలు తేల్చుకోనున్నాయి. బలపరీక్షకు ఒక రోజు ముందుగానే కూటమి పార్టీలన్నీ అత్యవసర సమావేశమయ్యాయి.
ఎన్సీపీ- కాంగ్రెస్.. డిప్యూటీ సీఎంలు :
ఈ సమావేశంలో తమ కూటమి నుంచి సీఎం నేతగా ఉద్ధవ్ ఠాక్రే పేరును ఏకగ్రీవంగా తీర్మానించాయి. సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేసిన అనంతరం ముంబైలోని ఓ హోటల్‌లో మూడు పార్టీల నేతలు సమావేశ మయ్యారు. ఈ సమావేశంలో ఉద్ధవ్‌ను తమ నేతగా ఎన్నుకున్నారు. డిసెంబర్ 1న ముంబైలోని శివాజీ పార్క్‌లో మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఇక డిప్యూటీ సీఎంలుగా ఎన్సీపీ నేత జయంత్ పాటిల్, కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ సైతం ప్రమాణం చేయనున్నారు.
కాంగ్రెస్-ఎన్సీపీలతో తొలి దోస్తీ :
ఇక, ఠాక్రే కుటుంబం నుంచి మహారాష్ట్ర సీఎం అయ్యే తొలి సభ్యుడిగా ఉద్ధవ్ ఠాక్రే కానున్నారు. మహారాష్ట్రలో మహా వికాస్ అగాధి అనే పిలిచే శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉద్ధవ్ నాయకత్వం వహించనున్నారు. ఉద్ధవ్ తండ్రి బాలాసాహేబ్ ఠాక్రే 1966లో ప్రాంతీయ పార్టీగా శివసేనను స్థాపించారు. 1960, జూలై 27న జన్మించిన ఉద్ధవ్.. 2012లో తండ్రి తదనంతరం శివసేన పార్టీ బాధ్యతలు చేపట్టారు. శివసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఉద్ధవ్.. కాంగ్రెస్ సహా ఎన్సీపీలతో చేతులు కలపడం కూడా ఇదే తొలిసారి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక ఉద్ధవ్ ఆరు నెలల్లో అసెంబ్లీ లేదా శాసనసభా మండలిలో ఎన్నికలు కోరాల్సి ఉంటుంది.
పోటీ చేసింది.. ఆధిత్య ఒక్కడే :
ఉద్ధవ్ ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కనీసం రాష్ట్ర శాసన సభలో సభ్యుడు కాదు. ఠాక్రే కుటుంబం నుంచి ఉద్ధవ్ కుమారుడు ఆధిత్యా ఠాక్రే మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసిన తొలి సభ్యుడిగా ఉన్నాడు. గతనెలలోనే వోర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆధిత్య గెలిపొందారు. తన పార్టీలోని ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసిన తర్వాత ఉద్ధవ్ ఎన్నికల్లో పోటీకి ఎంచుకునే అవకాశం ఉంది.
ఆయన కుమారుడు ఆధిత్యా కూడా తన తండ్రికి మార్గం సుగమం చేసేందుకు వోర్లీ స్థానం నుంచి రాజీనామా చేయనున్నారు. 288 అసెంబ్లీ స్థానాలకు జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాలు గెలవగా, శివసేన 56 స్థానాలు, కాంగ్రెస్-ఎన్సీపీ జతగా మొత్తం 98 స్థానాలు గెలుచుకున్నాయి.