ఆగస్టు నాటికి 30కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్…కేంద్ర ఆరోగ్యమంత్రి

  • Published By: venkaiahnaidu ,Published On : November 30, 2020 / 08:58 PM IST
ఆగస్టు నాటికి 30కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్…కేంద్ర ఆరోగ్యమంత్రి

Updated On : November 30, 2020 / 9:55 PM IST

Union Health Minister Harsh Vardhanవచ్చే ఏడాది మొదటి 3-4నెలల్లోనే దేశ ప్రజలకు తాము కరోనా వ్యాక్సిన్ అందించగలిగే అవకాశముందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ తెలిపారు. జులై-ఆగస్టు నాటికి దాదాపు 25-30కోట్ల మంది భారతీయులకు కరోనా వ్యాక్సిన్ అందించాలన్న ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని హర్షవర్థన్ తెలిపారు. తొలివిడతలో హెల్త్ వర్కర్లు,పారిశుధ్య కార్మికులు,వయో వృద్ధులు,కరోనా రోగులకు వ్యాక్సిన్ అందించనున్నారు.



ప్రతి ఒక్కరూ కోవిడ్-19 నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా హర్షవర్థన్ విజ్ణప్తి చేశారు. అందరూ మాస్క్ లు ధరించాలని,సామాజిక దూరం పాటించాలని ఇవి మన ఆరోగ్య సంరక్షణకు మంచిదని హర్షవర్థన్ పేర్కొన్నారు.



మరోవైపు, కరోనా వ్యాక్సిన్ రెడీ అయిన తర్వాత దాన్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు అందించేందుకు భారతీయ ఎయిర్ లైన్స్ మరియు ఎయిర్ పోర్ట్ లు ఇప్పటికే సిద్దమయ్యాయి. “ఆపరేషన్ కోవిడ్ వ్యాక్సిన్” కొరకు భారతీయ విమానయాన సంస్థలు మరియు విమానాశ్రయాలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.



“ఆపరేషన్ కరోనా వ్యాక్సిన్” పేరుతో సాగుతున్న ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించాలంటే భారీ కసరత్తు అవసరమవుతోంది. ఇందు కోసం ఇప్పటికే కేంద్రం ఆదేశాల మేరక రాష్ట్రాల్లో కమిటీల ఏర్పాటు పూర్తయింది. ఈ కమిటీల సాయంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకేసారి వ్యాక్సిన్‌ పంపిణీకి ఏర్పాట్లు సాగుతున్నాయి. అదే క్రమంలో వ్యాక్సిన్‌ను ఆయా ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా విమానయాన సంస్ధలు, విమానాశ్రయాలు కూడా తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.

కాగా, దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 94.31లక్షలకు చేరుకుంది. కోలుకున్నవారి సంఖ్య 88లక్షల 47వేల 600కి చేరుకుంది. మరణాల సంఖ్య 1లక్షా 37వేల 139కి చేరినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రకటించింది.