ప్రధాని మోడీతో కేంద్రమంత్రుల భేటీ..రైతుల డిమాండ్లపై చర్చ

Union ministers meeting PM Modi : వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేపట్టిన ఆందోళన రోజురోజుకు ఉధృతమవుతోంది. పదో రోజు రైతుల తమ ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. తమ డిమాండ్స్‌ను పరిష్కరించాలని.. లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈరోజు రైతులతో కేంద్ర ప్రభుత్వం 5వ దఫా చర్చలు జరుపనుంది.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ నేరుగా రంగంలోకి దిగారు. కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, నరేంద్రసింగ్ తోమర్, పీయూష్ గోయల్‌తో మోదీ అత్యవసరంగా భేటీ అయ్యారు. రైతుల డిమాండ్స్‌పై చర్చలు జరుపుతున్నారు. రైతులు కేంద్ర ప్రభుత్వం ఉంచిన డిమాండ్స్ సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నారు. రైతుల ఆందోళన విరమించేందుకు ఏం చేయాలన్న దానిపై సహచర మంత్రుల సూచనలు, సలహాలను మోదీ తీసుకుంటున్నారు.
ఢిల్లీ-యూపీ సరిహద్దు చిల్లా దగ్గర రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. 10వ రోజూ రైతులు
ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతం జైజవాన్ జై కిసాన్ నినాదాలతో దద్దరిల్లుతోంది. ఢిల్లీ నుంచి నోయిడా వెళ్తున్న వాహనాలను రైతులు అడ్డుకుంటున్నారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రైతుల ఆందోళన నేపథ్యంలో రహదారిపై పోలీసులు బారీకేడ్లు, వాటర్ కెనాల్స్‌ను మోహరించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని అన్నదాతలు తేల్చి చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించాలని రైతులు కోరుతున్నారు. లేకుంటే ఉద్యమాన్ని మరితం ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.