Uttar Pradesh Assembly : ఆరుగురు పోలీసులకు శిక్ష విధించిన యూపీ అసెంబ్లీ .. 34 ఏళ్లలో తొలిసారి
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ కోర్టుగా మారింది. ఆరుగురు పోలీసులకు శిక్ష విధించింది. 20 ఏళ్లనాటి ఓ కేసుకు సంబంధించి ఆరుగురు పోలీసులకు అసెంబ్లీ శిక్ష విధించింది.

UP Assembly Turns Into Court After 34 Years..send 6 Cops To one Day Custody
Uttar Pradesh Assembly : నేరం చేస్తే కోర్టులు శిక్ష విధిస్తాయి. ఒక్కోసారి నేరస్థులతో పాటు కొన్ని సందర్భాల్లో కోర్టులు పోలీసులకు కూడా శిక్షలు విధిస్తాయి. సాధారణంగా మందలింపులు..పరిస్థితి తీవ్రతను బట్టి ఒక్కోసారి సస్పెన్షన్ కూడా విధిస్తుంది. శిక్షలు విధించే పని న్యాయస్థానాలది. కానీ ఉత్తరప్రదేశ్ లో అసాధారణ సంఘటన చోటుచేసుకుంది. చట్టాలను రూపొందించే అసెంబ్లీయే కోర్టుగా మారింది. ఆరుగురు పోలీసులకు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ (Uttar Pradesh Assembly)శిక్ష విధించింది. గత 35 ఏళ్లలో ఇదే ఇటువంటి ఘటన జరగటం తొలిసారి కావటం విశేషం. పైగా దాదాపు 20 ఏళ్లనాడు జరిగిన ఓ ఘటనకు సంబంధించి ఆరుగురు పోలీసులకు యూపీ అసెంబ్లీ శిక్ష విధించటం మరో విశేషం..
దాదాపు రెండు దశాబ్దాల క్రితం అప్పటి బీజేపీ సలీల్ విష్ణోయ్, అతని మద్దతురాదులపై లాఠీ చార్జ్ చేసినందుకు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ (Uttar Pradesh Assembly) శుక్రవారం (మార్చి 3,2023) ఆరుగురు పోలీసులకు శిక్ష విధించింది. చట్టసభను కోర్టుగా మార్చటం 35 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇక్కడ మరో విశేషం ఏమిటంటో శిక్ష విధించబడిన పోలీసుల్లో ఒకరు ఇప్పటికే రిటైర్ అవ్వటం..
కాన్పూర్ (kanpur)లో విద్యుత్ కోతలకు నిరసనగా 2004 సెప్టెంబరు 15న అప్పటి బీజేపీ ఎమ్మెల్యే సలీల్ విష్ణోయ్(Salil Vishnoi) ఆధ్వర్యంలోని ఓ బృందం కాన్పూర్‌నగర్ జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు సమర్పించేందుకు వెళ్తుండగా.. పోలీసు సిబ్బంది ఆయనను ఆయన అనుచరులను అడ్డుకున్నారు. వారి పట్ల దురుసుగా ప్రవర్తించటమే కాకుండా లాఠీచార్జ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ దాడిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.దీంతో సదరు ఎమ్మెల్యే శాసనసభ తనకు కల్పించిన ప్రత్యేక హక్కులకు భంగం వాటిల్లినట్లు ఆరోపిస్తూ.. హౌస్ ఆఫ్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు.బీజేపీ ఎమ్మెల్యే సలీల్ విష్ణోయ్ ప్రస్తుతం యూపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో సభ్యుడిగా ఉన్నారు. ఈ దాడిలో ఆయన కాలు విరిగి ఆస్పత్రిపాలయ్యారు.
ఎమ్మెల్యే ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ప్రివిలేజ్ కమిటీ.. ఇటీవల సంబంధిత పోలీసులకు శిక్ష విధించాలంటూ సిఫార్సు చేసింది. దీంతో శాసనసభ శుక్రవారం సదరు పోలీసులకు శిక్ష విధించింది. ఈ క్రమంలోనే అసెంబ్లీ వ్యవహారాల మంత్రి సురేష్ ఖన్నా.. ఆరుగురు పోలీసులకు ఒక రోజు నిర్బంధం విధించాలంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అర్ధరాత్రి 12 గంటల వరకు వారిని అసెంబ్లీలోనే నిర్బంధించాలని స్పీకర్ సతీష్ మహానా ఆదేశించారు. కానీ ఆ పోలీసుల పట్ల మర్యాదగానే వ్యవహరించాలని సూచించారు.
కాగా కాన్పూర్ లో జరిగిన ఈ దాడిలో బాబుపూర్వా ఇన్‌స్పెక్టర్ అబ్దుల్ సమద్ ఉన్నారు. ప్రస్తుతం ఆయన రిటైర్ అయ్యారు. అలాగే కిద్వాయ్ నగర్ ఎస్‌హెచ్‌వో శ్రీకాంత్ శుక్లా, ఎస్సై త్రిలోకి సింగ్, కానిస్టేబుళ్లు ఛోటే సింగ్, వినోద్ మిశ్రా, మెహర్బాన్ సింగ్‌లకు అసెంబ్లీ తాజాగా ఈ వినూత్న శిక్ష విధించింది. దీనికి సంబంధించి విచారణకు సదరు పోలీసులు అసెంబ్లీకి హాజరైయ్యారు. వీరంతా ఆనాడు జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పారు. దీంతో వారికి స్పీకర్ ఒకరోజు నిర్భంధ శిక్ష విధించారు. అసెంబ్లీ విధించిన శిక్షను పాటించటానికి సదరు పోలీసులు విధానసభ భవనంలోని ఓ గదిలో ఉండిపోవాల్సి వచ్చింది. వారికి స్పీకర్ ఆదేశాల ప్రకారం ఆహారం, ఇతర సౌకర్యాలు ఏర్పాట్లు చేశారు. మర్యాదగా చూసుకున్నారు.