వామ్మో.. ప్రతి శనివారం ఇతడిని కాటేస్తున్న పాము.. డాక్టర్లు ఏమన్నారంటే..
UP man bitten by snake: తనను పాము తరుచూ కాటేస్తుండడంతో ఆర్థిక సాయం చేయాలని అధికారులను బాధితుడు అడిగాడు.

Snake Bite: పాములు పగపడతాయని కొందరు అంటుంటారు. ఆ నమ్మకంలో నిజం ఎంతుందో కానీ, యూపీలోని ఫతేపూర్‌లో ఓ యువకుడి (24)ని పాము ప్రతి శనివారం కాటేస్తోంది. ఇలా అతడిని 40 రోజుల్లో ఏడోసారి పాము కాటేసింది. వికాస్ దూబేను పాము పదే పదే కాటేస్తుండడంపై చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజీవ్ నయన్ గిరి మీడియాతో మాట్లాడారు.
తనను పాము తరుచూ కాటేస్తుండడంతో వికాస్ దూబే ఆర్థిక సాయం చేయాలని అధికారులను అడిగారని చెప్పారు. అతడు ఇటీవల కలెక్టరేట్‌కు వెళ్లాడని, పాము కాటుకు వైద్యం చేయించుకోవడానికి చాలా డబ్బు ఖర్చు చేశానని చెప్పాడని అన్నారు. ఇక వైద్యం చేయించుకునే స్తోమత తనకు లేదని, అందుకే అధికారులను ఆర్థిక సాయం కోరుతున్నానని కన్నీరు పెట్టుకున్నాడని తెలిపారు.
నిజంగానే కాటేస్తోందా?
ప్రభుత్వ ఆసుపత్రిలో యాంటీ స్నేక్ వెనమ్ దొరుకుతుందని, అక్కడకు వెళ్లాలని వికాస్ దూబేకు చెప్పానని చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజీవ్ నయన్ గిరి అన్నారు. అసలు అతడిని పదే పదే కాటేస్తోంది పామేనా అన్న విషయాన్ని నిర్ధారించాల్సి ఉందని చెప్పారు. అతడికి వైద్యం అందిస్తున్న డాక్టర్ కి ఉన్న నైపుణ్యాలను గురించి కూడా తెలుసుకోవాల్సి ఉందని తెలిపారు.
ప్రతి శనివారం పాము కరిచిందని చెప్పి, ఒకే ఆసుపత్రిలో అతడు చేరుతున్నాడని అన్నారు. అంతేగాక, ఒకే ఒక్క రోజులో అతడు కోలుకుంటుండడం వింతగా అనిపిస్తోందని చెప్పారు. దీనిపై విచారణ జరిపేందుకు ముగ్గురు డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Also Read: బిహార్‌లో తప్పిన ప్రమాదం.. జలపాతంలో ఒక్కసారిగా పెరిగిన వరద ఉధృతి.. పర్యాటకులు ఎలా ఒడ్డుకు చేరారంటే..