పుల్వామా ఉగ్రదాడి వెనుక ISI హస్తం

  • Published By: venkaiahnaidu ,Published On : February 15, 2019 / 05:05 AM IST
పుల్వామా ఉగ్రదాడి వెనుక ISI హస్తం

Updated On : February 15, 2019 / 5:05 AM IST

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో గురువారం(ఫిబ్రవరి-14,2019) సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ టార్గెట్ గా పాకిస్తాన్ కి చెందిన జైషే ఈ మహమద్ ఉగ్రసంస్థ జరిపిన మారణహోమాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ ఉగ్రదాడి వెనుక పాక్ గూఢచర్య సంస్థ ISI హస్తముండొచ్చని మాజీ సీఐఏ విశ్లేషకుడు బ్రూసీ రైడల్ అన్నారు. అన్ని దేశాలు టెర్రరిస్టులపై ఉక్కుపాదం మోపాలని అగ్రరాజ్యం పిలుపునిచ్చింది.

టెర్రరిస్టులకు ఏ దేశం కూడా ఆశ్రయమివ్వరాదని కోరింది. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని,అన్ని విధాలుగా టెర్రరిజాన్ని అంతమొందించేందుకు భారతప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తాము ధృదడమైన కమిట్ మెంట్ కలిగి ఉన్నామని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి రాబర్ట్ పల్లాడినో తెలిపారు. బాధిత సీఆర్ఫీఎఫ్ జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు. పాకిస్తాన్ ని జైషే ఈ మహమద్, ఇతర ఉగ్రసంస్థల పట్ల కఠినవ్యవహరించేలా చేయడంలో యూఎస్ ఫెయిల్ అయిందని పుల్వామా ఉగ్రదాడిని చూస్తే అర్థమవుతోందని ఎక్స్ పర్ట్స్ తెలిపారు.

గురువారం జైషే ఈ మహమద్ ఉగ్రసంస్థ జరిపిన ఐఈడీ బ్లాస్ట్ లో 42మంది సీఆర్ఫీఎఫ్ జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడిని ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలు ఖండించాయి. 2001 తర్వాత భారత్ లో అతిపెద్ద ఉగ్రదాడి పుల్వామా దాడి నిలిచింది. జవాన్ల త్యాగాలు వృధాకావని ప్రధాని మోడీ అన్నారు.