US Deported Indians : వలసదారులతో భారత్ బయలుదేరిన అమెరికా మిలిటరీ విమానం ల్యాండ్ అయ్యేది ఇక్కడే..!
అమెరికా ప్రభుత్వ నిర్ణయంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా మంది భారతీయులు వర్క్ పర్మిట్‌లతో దేశంలోకి ప్రవేశించారని..

US Deported Indians : దాదాపు 200 మంది భారత అక్రమ వలసదారులతో కూడిన అమెరికా మిలటరీ విమానం బయలుదేరిన సంగతి తెలిసిందే. ఈ విమానం బుధవారం అమృత్‌సర్ విమానాశ్రయంలో దిగనుంది. బహిష్కరించబడిన భారతీయులను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రిసీవ్ చేసుకుంటారు. ఈ మేరకు పంజాబ్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
వలసదారులను వెనక్కి పంపేయాలని అమెరికా తీసుకున్న నిర్ణయంపై పంజాబ్ ఎన్నారై వ్యవహారాల మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు అమెరికా ఆర్థిక వ్యవస్థకు దోహదపడ్డారని గుర్తు చేశారు. అలాంటి వారిని అమెరికా నుంచి బహిష్కరణ చేయడానికి బదులుగా శాశ్వత నివాసం మంజూరు చేయాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.
అక్రమ వలసదారులంతా పంజాబ్, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారే..
అమెరికా నుంచి బయలుదేరిన సీ-17 మిలటరీ విమానంలో భారత్ కు చెందిన మొత్తం 205 అక్రమ వలదారులు ఉన్నారు. వీరంతా పంజాబ్ దాని పొరుగు రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తోంది. అమెరికా మిలిటరీ విమానం బుధవారం అమృత్‌సర్‌లో ల్యాండ్ అవుతుందని తెలుస్తోంది.
Also Read : ఆకాశ్ బొబ్బ ఎవరు? అతడి పేరు ఇంతలా మారుమోగిపోతుందేంటి?
డొనాల్డ్ ట్రంప్ రాకతో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..
డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అక్రమ వలసదారులపై అమెరికా చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలు అణిచివేత ప్రారంభించాయి. పంజాబ్ నుండి చాలా మంది వ్యక్తులు అక్రమ మార్గాల ద్వారా లక్షల రూపాయలు ఖర్చు చేసి అగ్రరాజ్యంలోకి ప్రవేశించారు. ఇప్పుడు వారంతా బహిష్కరణను ఎదుర్కొంటున్నారు.
“ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పంజాబ్ ప్రభుత్వం వైపు నుండి మేము మా వలసదారులను రిసీవ్ చేసుకుంటాము. వారి కోసం కౌంటర్లు ఏర్పాటు చేస్తాము” అని డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. “మేము కేంద్రంతో టచ్‌లో ఉన్నాము. సమాచారం వచ్చినప్పుడు, మేము పంచుకుంటాము” అని డీజీపీ వెల్లడించారు.
అమెరికా ప్రభుత్వం నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి..
అమెరికా నుండి భారతీయుల బహిష్కరణ తీవ్రమైన సమస్య అని పంజాబ్ ఎన్నారై వ్యవహారాల మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్ అభివర్ణించారు. అమెరికా ప్రభుత్వ నిర్ణయంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా మంది భారతీయులు వర్క్ పర్మిట్‌లతో దేశంలోకి ప్రవేశించారని, ఆ తర్వాత గడువు ముగిసిందని, వారిని చట్టవిరుద్ధం చేశారని అన్నారు.
Also Read : ట్రంప్ మరో సంచలనం.. మిలటరీ విమానంలో వలసదారులను భారత్‌కు పంపించేసిన అమెరికా
అమెరికా ఆర్థిక వ్యవస్థకు దోహదపడిన ఈ వ్యక్తులకు బహిష్కరణకు బదులు శాశ్వత నివాసం కల్పించాలని ఆయన వాదించారు. అమెరికాలో నివసిస్తున్న పంజాబీల ఆందోళనలు, ప్రయోజనాల గురించి చర్చించడానికి వచ్చే వారం విదేశీ వ్యవహారాల మంత్రిని కలవాలని యోచిస్తున్నట్లు ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల మంత్రి తెలిపారు. చట్ట విరుద్ధమైన మార్గాల ద్వారా విదేశాలకు వెళ్లవద్దని పంజాబీలకు విజ్ఞప్తి చేశారాయన.