ఘోర ప్రమాదం.. భక్తులతో వెళ్తున్న వాహనం కాల్వలో పడి 11మంది మృతి

ఉత్తరప్రదేశ్ ఘోర ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి సరయూ కాల్వలో పడిపోయింది.

ఘోర ప్రమాదం.. భక్తులతో వెళ్తున్న వాహనం కాల్వలో పడి 11మంది మృతి

Updated On : August 3, 2025 / 12:40 PM IST

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి సరయూ కాల్వలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన గోండా జిల్లాలోని ఇటియా థోక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది.


ప్రమాదం సమయంలో వాహనంలో 15 మంది భక్తులు ప్రయాణిస్తున్నారు. వీరంతా స్థానికంగా ఉన్న పృథ్వీనాథ్ ఆలయానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన జరిగిన వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో మిగిలిన నలుగురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారికికూడా తీవ్ర గాయాలు కావటంతో వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. కాల్వలో నుంచి మృతదేహాలను వెలికి తీసినట్లు పోలీసులు వెల్లడించారు. వాహనంలోని వారంతా మోతీగంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సిహాగావ్‌ వాసులుగా అధికారులు గుర్తించారు.

ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.