ఉత్తర ద్వార దర్శనం అర్ధం, పరమార్ధం

  • Published By: chvmurthy ,Published On : January 4, 2020 / 06:07 AM IST
ఉత్తర ద్వార దర్శనం అర్ధం, పరమార్ధం

Updated On : January 4, 2020 / 6:07 AM IST

ముక్కోటి ఏకాదశి రోజు ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. అసలు ఉత్తర ద్వార దర్శనం అంటే ఏమిటి..? ఉత్తర ద్వార దర్శనం లోని అర్ధం, పరమార్ధం ఏమిటో ఒకసారి తెలుసుకుందాం.

Vaikunta Ekadasi Tirumala
” వ్యక్తిర్ ముక్తిర్ మవాప్నోతి  ఉత్తర ద్వార దర్శనాత్ ” అనే శ్లోకాన్ని అనుసరించి ఏ వ్యక్తి అయినా ముక్తిని పొందాలంటే ఉత్తర  ద్వార దర్శనాన్ని  చేస్తే తప్పక  ముక్తి లభిస్తుందంటారు ఆధ్యాత్మిక వేత్తలు.  సంవత్సరంలో  ఉండే 12 నెలల్లో 11 వ నెల పుష్యమాసం అవుతుంది. ఆ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్ల పక్ష ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి,  ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు.  ఆరోజున ప్రతి దేవాలయంలో కూడా దేవుడ్ని ప్రత్యేకంగా  ఉండే ఉత్తరవైపు ద్వారా ప్రవేశం కల్పించే దర్శనం  ఉత్తర  ద్వార దర్శనం అంటారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర  ద్వారంనుంచి శ్రీ మహా విష్ణువును దర్శించిన వారికి పునర్జన్మ ఉండదు. ఏకంగా మోక్ష దాయకమే అని వేదవాక్కు. 

 

మాసానాం మార్గశీర్షోహం’ అని శ్రీకృష్ణపరమాత్మ ‘భగవద్గీత’ విభూతియోగంలో చెప్పాడు. అంటే, ‘మాసాలలో మార్గశిర మాసాన్ని నేను’ అని అర్థం. ఆధ్యాత్మికంగా ఉన్నతమైన ఈమాసం, ప్రకృతిని అంటా సౌందర్యమాయం చేస్తుంది. మార్గశిర మాసం విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మార్గశిర మాసం హేమంత ఋతువులో మెదటినెల. దీనినే సౌరమానాన్ని అనుసరించి ధనుర్మాసం అని, చాంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అన్నారు. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే, మన పెద్దలు సంవత్సరకాలాన్ని ఉత్తరాయణం, దక్షిణాయణం అని రెండు భాగాలుగా విభజించారు. ఉత్తరాయణం పుణ్యకార్యాలకు ఉత్తమమైనదనీ, ఆకాలంలో మరణించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం.

sri seetarama chandra swamy bhadrachalam

 

ముక్కోటి  ఏకాదశి రోజున ఎక్కువ  మంది భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు.  శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠంలోని వాకిళ్లు ఈరోజునే తెరుచుకుంటాయి. వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినమైన ముక్కోటి ఏకాదశినాడు సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు.
 

అసుర(రాక్షసుల) బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారు. అక్కడ ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించుకుంటారు. దీంతో స్వామి అనుగ్రహించి రాక్షస పీడ వదిలిస్తాడు. ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. దీన్నే ‘హరివాసరమ’ని, ‘హరిదినమ’ని, ‘వైకుంఠ దినమ’ని అంటారు.
simhachalam appanna uttara dwara darsanam

ఈ ఒక్క ఏకాదశి ‘మూడు కోట్ల ఏకాదశుల’తో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు “వైకుంఠ ఏకదశీ వ్రతం” ఆచరించిన వారికి శుభఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి.

 

అలాగే కృత యుగంలో “ముర” అనే రాక్షసుడు దేవతలను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకుంటారు. దీంతో స్వామి మురాసురుడి మీదికి దండెత్తి అతన్ని వధించాలని చూస్తాడు. ముర వెళ్లి సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటే, అతన్ని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకుంటాడు. అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి, విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే, మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా, ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు ‘ఏకాదశి’ అన్న బిరుదు ప్రసాదించాడు. నాటి నుంచి ఏకాదశీ వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని పురోహితులు అంటున్నారు.

 

వైష్ణవ ఆళ్వారుల్లో శ్రీనమ్మాళ్వారులు ఈ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రత మాచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలోను ఉదయం నుంచీ ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోనికి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

 

అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి. ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతముండే వారికి మరో జన్మంటూ ఉండదని పురోహితులు చెబుతున్నారు.