Varanasi : వీఎంసీ కీలక నిర్ణయం.. శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
Varanasi : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి నగరం త్వరలో శాకాహార నగరంగా మారనుంది. వారణాసి నగర మున్సిపల్ కార్పొరేషన్(వీఎంసీ) తన పరిధిలోని మాంసం, చేపలు, కోళ్ల దుకాణాలను నగర శివార్లకు తరలించాలని నిర్ణయించింది.
Varanasi
Varanasi : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి నగరం త్వరలో శాకాహార నగరంగా మారనుంది. వారణాసి నగర మున్సిపల్ కార్పొరేషన్(వీఎంసీ) తన పరిధిలోని మాంసం, చేపలు, కోళ్ల దుకాణాలను నగర శివార్లకు తరలించాలని నిర్ణయించింది. ఈ మేరకు మేయర్ అశోక్ తివారీ అధ్యక్షతన జరిగిన మున్సిపల్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దీంతో నగర పరిధిలో ఉన్న 350 నుంచి 400 మాంసం దుకాణాలను రాబోయే ఆరు నెలల్లో దీపావళిలోపు విడతల వారీగా నగర శివార్లకు తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ దుకాణాలను రామ్‌నగర్, సుజాబాద్, గణేశ్‌పూర్, అవలేష్ నగర్, శివపూర్ ప్రాంతాలకు తరలించనున్నారు. దీంతో కాశీనగరం దేశంలోని రెండవ శాకాహార నగరంగా మారనుంది. ప్రస్తుతం ప్రపంచంలోని ఏకైక పూర్తి శాకాహార పట్టణంగా గుజరాత్ రాష్ట్రంలోని ‘పాలితానా’ గుర్తింపు పొందింది. ఇక్కడ 2014 నుంచి మాసం, చేపలు, గుడ్లు విక్రయాలపై నిషేధం అమల్లోఉంది. వారణాసిలో హిందువులు 72శాతం, ముస్లింలు 27శాతం ఉన్నారనేఅంచనాలున్నాయి.
తాజా నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నగర పరిశుభ్రత, పుణ్యక్షేత్రం ప్రత్యేకత దృష్ట్యా స్వాగతిస్తుండగా.. మరికొందరు దుకాణాలు దూర ప్రాంతాలకు మారితే వినియోగదారులకు, వ్యాపారులకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం మాంసాహారాన్ని నిషేధించడం కాదని.. కేవలం దుకాణాలను వేరే ప్రాంతానికి తరలించి.. అక్కడ వ్యాపారాలు చేసుకునేలా అవకాశాలు కల్పిస్తున్నామని చెబుతున్నారు.
