హిట్లర్ మాట్లాడినట్లే మోడీ,షా మాట్లాడుతున్నారు

  • Published By: venkaiahnaidu ,Published On : January 24, 2020 / 04:16 AM IST
హిట్లర్ మాట్లాడినట్లే మోడీ,షా మాట్లాడుతున్నారు

Updated On : January 24, 2020 / 4:16 AM IST

జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్‌తో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలను పోల్చారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్. బీజేపీని ఏదైనా అనండి కానీ, భారత్‌ను విడగొట్టే వ్యాఖ్యలు చేస్తే మాత్రం జైలుకు పంపుతామంటూ ఇటీవల అమిత్ షా హెచ్చరించిన విషయం తెలిసిందే.

అమిత్ షా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఛత్తీస్  గడ్ సీఎం…హిట్లర్ సైతం తనను ఎవరేమన్నా ఫరవాలేదని, జర్మనీని మాత్రం అనడానికి వీళ్లేదని తన ప్రసంగాల్లో చెప్పేవారని, ‘మోటా భాయ్, ఛోటా భాయ్’ సైతం అదే స్వరంతో, అదే భాషలో మాట్లాడుతున్నారని  అన్నారు. నరేంద్ర మోడీ అబద్ధాలు చెబుతున్నారో, తానే అబద్ధాలు ఆడుతున్నారో అమిత్‌షా ముందు చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు.

ఒకరు జాతీయ పౌర రిజిస్టర్ (NRC) అమలు చేస్తామని చెబుతుంటే, మరొకరు లేదని చెబుతున్నారని, ఎవరు అబద్ధాలాడుతున్నారో ముందు చెప్పాలని అన్నారు. ఎన్‌ఆర్‌సీ అమలు చేస్తే సంతకం చేయని మొదటి వ్యక్తిని తానే అవుతానని భూపేష్ బఘెల్ పునరుద్ఘాటించారు. ఎన్‌ఆర్‌సీ అమలు తర్వాత భూముల్లేని వారు, నిరక్షరాస్యులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారన్నారు.