Rahul Bajaj : ప్రభుత్వ లాంఛనాలతో రాహుల్ బజాజ్ అంత్యక్రియలు
దాదాపు 5 దశాబ్దాల పాటు బజాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలతో ఆయనకు అనుబంధం ఉంది. దేశంలోని అత్యంత విజయవంతమైన పారిశ్రామికవేత్తల్లో రాహుల్ బజాజ్ ఒకరు...

Industrialist Rahul Bajaj,
Rahul Bajaj To be Cremated : ప్రముఖ భారత్ బజాజ్ ఆటో మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో పుణేలో 2022, ఫిబ్రవరి 13వ తేదీ ఆదివారం అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. ఉదయం 11.30 గంటలకు ఆయన నివాసం భౌతికకాయం సందర్శనార్ధం ఉంచుతారు. సాయంత్రం నాలుగు గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రాహుల్ బజాజ్ మృతిపట్ల రాష్ట్రపతి, ప్రధాని సహా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంతాపం తెలిపారు. 83 ఏళ్ల రాహుల్ బజాజ్ గత కొంత కాలంగా న్యూమోనియాతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. రూబి హాల్ క్లినిక్‌లో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. రాహుల్ బజాజ్ 1972లో బజాజ్ గ్రూప్ బాధ్యతలను స్వీకరించారు.
Read More : US Study: బూస్టర్ డోస్ ప్రభావం కూడా కొంతకాలమే.. నాలుగో డోసూ అవసరం కావొచ్చు!
దాదాపు 5 దశాబ్దాల పాటు బజాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలతో ఆయనకు అనుబంధం ఉంది. దేశంలోని అత్యంత విజయవంతమైన పారిశ్రామికవేత్తల్లో రాహుల్ బజాజ్ ఒకరు. టూ వీలర్స్, త్రీ వీలర్స్ రంగంలో అనేక కొత్త ఆవిష్కరణలకు కారణమైన బజాజ్ ఆటో సంస్థ రాహుల్ బజాజ్ సారథ్యంలో అగ్రస్థానానికి వెళ్లింది. జూన్ 10, 1938న మార్వాడి కుటుంబంలో జన్మించారు రాహుల్ బజాజ్. ఆయన ఎకనామిక్స్, లా డిగ్రీ చేశారు. అనంతరం హోవార్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏలో పట్టా పొందారు. రాహుల్ బజాజ్ 2006 నుంచి 2010 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా పని చేశారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2001లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. గతేడాది ఆయన బజాజ్ ఆటో చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. రాహుల్ బజాజ్ తర్వాత 76 ఏళ్ల నీరజ్ బజాజ్ బజాజ్ ఆటో ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు.