Weekend Curfew In Delhi : ఢిల్లీలో వారాంతపు కర్ఫ్యూ..మాల్స్,జిమ్ లు మూసివేత
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది.

Weekend Curfew In Delhi Malls Gyms Shut
Curfew In Delhi దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ కరోనా కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీలో బుధవారం 17, 282 కేసులు, 104 మరణాలు నమోదయ్యాయి. ఢిల్లీలో 24 గం.ల వ్యవధిలో మొత్తం 1,08,534 కోవిడ్ టెస్ట్‌లు చేపట్టగా…వీటిలో ఏకంగా 15.92 శాతం మేర పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి. ఈ స్థాయిలో పాజిటివ్ రేటు నమోదుకావడం ఇదే తొలిసారిగా అధికారులు చెబుతున్నారు. చివరగా నవంబరు 15న 15.33 శాతం పాజిటివ్ రేటు నమోదుకావడమే అత్యధికంగా ఉంటూ వచ్చింది.
ఈ సమయంలో గురువారం ఢిల్లీ ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి లెఫ్టినెంట్ గవర్నర్‌తో సీఎం కేజ్రీవాల్ సమవేశమయ్యారు. కరోనా కట్టడి కోసం ఆంక్షలను అమలు చేయనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్‌కు సీఎం వివరించారు. అనంతరం.. కరోనా వ్యాప్తి కట్టడి కోసం ఢిల్లీలో శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకూ వారాంతపు కర్ప్యూ విధిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. లాక్‌డౌన్ సమయంలో మాల్స్, ఆడిటోరియంలను.. మూసివేయనున్నట్లు తెలిపారు.
వీకెండ్ కర్ఫ్యూ కారణంగా ఎసెన్షియల్ సర్వీసులకు మరియు పెళ్లిళ్లు వంటి శుభకార్యాలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని కేజ్రీవాల్ తెలిపారు.. పాస్‌లు ఇస్తామని తెలిపారు. రెస్టారెంట్లలో తినడానికి వీల్లేదన్న కేజ్రీవాల్.. పార్శిల్ తీసుకెళ్లేందుకే అనుమతిస్తామని తెలిపారు. సినిమా థియేటర్లు 30శాతం సామర్థ్యంతోనే.. నడపాలని స్పష్టంచేశారు. ఢిల్లీలోని ఆసుపత్రుల్లో పడకల కొరతలేదని.. కేజ్రివాల్ చెప్పారు. ప్రస్తుత డేటా ప్రకారం 5 వేల పడకలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు.
ఇక, కరోనా పేషెంట్ల కోసం బెడ్స్ కొరత రాకూడదని ఢిల్లీలోని 15 హోటళ్లను తాత్కాలిక కోవిడ్ ఆస్పత్రులుగా మార్చుతున్నారు. క్రౌన్ ప్లాజా, ఐటీసీ వెల్కమ్, రాడిస్సన్ బ్లూ, సూర్య తదితర 5 స్టార్ హోటళ్లను ఇలా కోవిడ్ ఆస్పత్రులుగా మార్చారు. వీటిని ప్రైవేట్ ఆస్పత్రులకు అనుసంధానం చేశారు. 5 స్టార్ హోటళ్లలో ఒక రోజు బెడ్ ఛార్జీలను రూ.5 వేలు, 3-4 స్టార్ హోటళ్లలో రూ.4 వేలుగా నిర్ణయించారు. ఆ మేరకు అదనంగా 3000 బెడ్స్‌ను కోవిడ్ రోగులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. స్వల్ప లక్షణాలతో వచ్చే కోవిడ్ రోగులను ఇక్కడ అడ్మిట్ చేసుకుని చికిత్స కల్పిస్తారు. పరిస్థితి విషమిస్తే అక్కడి నుంచి ఆస్పత్రులకు తరలిస్తారు. ప్రైవేటు ఆస్పత్రులు ఈ హోటళ్లను కాంట్రాక్టుకు తీసుకుని తాత్కాలిక ఆస్పత్రులుగా నిర్వహిస్తాయి. అలాగే, పలు బాన్‌క్వెట్ హాల్స్, ఓ స్కూల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను కూడా తాత్కాలిక కోవిడ్ ఆస్పత్రులుగా మార్చారు. వీటి ద్వారా 1,100 కోవిడ్ బెడ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.