Kolkata : రేపటి నుంచి విధుల్లోకి జూనియర్ వైద్యులు.. మమత సర్కార్‌కు వారంరోజులు గడువు

ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అత్యవసర, తప్పనిసరి సేవల విభాగాల్లో తాము విధుల్లో పాల్గొంటామని, అవుట్ పేషంట్ విభాగాల్లో మాత్రం విధులు చేపట్టబోమని జూనియర్ వైద్యులు తెలిపారు..

Kolkata : రేపటి నుంచి విధుల్లోకి జూనియర్ వైద్యులు.. మమత సర్కార్‌కు వారంరోజులు గడువు

Junior Doctors

Updated On : September 20, 2024 / 7:49 AM IST

Kolkata Junior Doctors : కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో మహిళా వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా ఆగస్టు 9వ తేదీ నుంచి జూనియర్ వైద్యులు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. దీంతో వీరి నిరసన 41 రోజులుగా కొనసాగుతుంది. పలు దఫాలుగా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం వీరితో చర్చలు జరిపినప్పటికీ తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని చెప్పారు. గురువారం మమత సర్కార్ మరోసారి జూనియర్ వైద్యులతో చర్చలు జరిపింది. ఈ చర్చల్లో తమ డిమాండ్లలో అధికశాతం డిమాండ్లకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఆమోదం తెలపడంతో శనివారం (21వ తేదీ) నుంచి పాక్షికంగా విధులకు హాజరవుతామని జూనియర్ వైద్యులు ప్రకటించారు.

Also Read : Kolkata Doctor Case : కోల్‌కతా హత్యాచారం కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఎఫ్ఐఆర్ నమోదు ఆలస్యంపై ప్రశ్నల వర్షం

ప్రభుత్వ ఆసుపత్రుల్లోని అత్యవసర, తప్పనిసరి సేవల విభాగాల్లో తాము విధుల్లో పాల్గొంటామని, అవుట్ పేషంట్ విభాగాల్లో మాత్రం విధులు చేపట్టబోమని జూనియర్ వైద్యులు తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి వారం రోజులు సమయం ఇస్తామని, అప్పటికీ తమ డిమాండ్లు పరిష్కారం కాకపోతే తిరిగి విధులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోని స్వాస్థ్య భవన్ ఎదుట నిర్వహిస్తున్న ఆందోళన శిబిరాన్ని శుక్రవారం ఎత్తేస్తామని తెలిపారు. దానికి ముందు నగరంలో ర్యాలీ నిర్వహిస్తామని జూనియర్ వైద్యులు వెల్లడించారు.

Also Read : Kolkata Doctor Case : కోల్‌కతాలో పీజీ వైద్యురాలి ఘటన.. తెలుగు రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో ఓపీ సేవలు బంద్

కోల్ కతా ఘటనకు నిరసనగా జూనియర్ వైద్యులు ప్రధానంగా ఐదు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. గురువారం జరిగిన చర్చల్లో మమత ప్రభుత్వం మూడు డిమాండ్లను ఆమోదించింది. సీఎం మమతా బెనర్జీ స్వయంగా వైద్యుల బృందంతో మాట్లాడి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మరోవైపు.. కోల్ కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు సంబంధించి సీబీఐ అధికారుల విచారణ కొనసాగుతుంది. తాజాగా టీఎంసీ యూత్ లీడర్ ఆశిష్ పాండేను సీబీఐ విచారించింది. ఆర్జీ కర్ మెడికల్ కళాశాలలో హౌస్ స్టాప్ గానూ అతను పనిచేస్తున్నాడు. అర్థరాత్రి దాకా అతడిని సీబీఐ సీజీవో కాంప్లెక్స్ కార్యాలయంలో అధికారులు విచారించారు. పలువురి కాల్ లిస్ట్ లో పాండే పేరు ఉంది. టైనీ డాక్టర్ చనిపోయిన రోజు సాల్ట్ లేక్ లోని ఓ హోటల్ లో తన స్నేహితురాలితో పాండే ఉన్నాడు.