INDIA vs Bharat: విపక్షాలు ‘ఇండియా’ అని పేరు పెట్టగానే.. భారత్ అంటూ భగ్గున లేచిన బీజేపీ

మన నాగరికత వివాదం ఇండియా, భారత్ చుట్టూ తిరుగుతోంది. బ్రిటిష్ వారు మన దేశానికి ఇండియా అని పేరు పెట్టారు. వలస వారసత్వాల నుంచి మనల్ని మనం విముక్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి

INDIA vs Bharat: విపక్షాలు ‘ఇండియా’ అని పేరు పెట్టగానే.. భారత్ అంటూ భగ్గున లేచిన బీజేపీ

Updated On : July 18, 2023 / 8:17 PM IST

Congress vs BJP: విపక్ష పార్టీలు తమ కూటమికి ఇండియా (I.N.D.I.A) అనే పేరు ఖరారు చేయగానే ‘భారత్ వర్సెస్ ఇండియా’ అనే సరికొత్త వివాదానికి తెరలేపింది భారతీయ జనతా పార్టీ. ఇండియా పేరు ప్రకటించగానే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ మన దేశ నాగరికత వివాదం అంతా ఇండియా, భారత్ చుట్టూ తిరుగుతోందంటూ విరుచుకుపడ్డారు. భారతదేశానికి బ్రిటిషు వారు ఇండియా అని పేరు పెట్టారని, అది వలసవాదుల పేరని హిమంత అన్నారు.


‘‘మన నాగరికత వివాదం ఇండియా, భారత్ చుట్టూ తిరుగుతోంది. బ్రిటిష్ వారు మన దేశానికి ఇండియా అని పేరు పెట్టారు. వలస వారసత్వాల నుంచి మనల్ని మనం విముక్తి చేసుకోవడానికి ప్రయత్నించాలి. మన పూర్వీకులు భారత్ కోసం పోరాడారు. మేము భారత్ కోసం పని చేస్తూనే ఉంటాము’’ అని సీఎం హిమంత బిశ్వా శర్మ ట్వీట్ చేశారు. చివరిలో ‘బీజేపీ ఫర్ భారత్’ అని రాసుకొచ్చారు.


అయితే హిమంత వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఘాటుగా స్పందించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1ని ప్రస్తావిస్తూ ఇండియా అంటే భారత్ అని, రాజ్యాల కలయిక అని రాజ్యాంగ నిర్మాతలు ప్రస్తావించారని రివర్స్ అటాక్ చేశారు. ఇదే స్ఫూర్తితో బెంగళూరు వేదికగా 26 పార్టీలతో ఇండియన్ నేషనల్ డెవలప్‭మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్ ఏర్పడిందని అన్నారు. ఈ ట్వీటులో ఇండియా కూటమి పత్రికా ప్రకటనను జైరాం రమేష్ షేర్ చేశారు.