Narakasura : నరకాసుర వధ ఎందుకు జరిగిందంటే?..
చెడుమార్గం పట్టిన కొడుకును ఉద్ధరించే శక్తి తల్లికే ఉంది. చీకటిలో చిక్కుకున్న నరకుడిని తీర్చిదిద్దే శక్తి భూదేవికే ఉంది. అప్పటికి ద్వాపర యుగం వచ్చేసింది. భూదేవి అంశ ద్వారకలో సత్యభామగా ఉంది.

Narakasura
Narakasura : ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. ఈ నరక చతుర్దశి తర్వాతి రోజే దీపావళి. తెలుగు పండుగల్లో నరక చతుర్దశి, దీపావళి ప్రముఖమైనవి. హిరణ్యాక్షుడు, బకాసురుడు తదితర రాక్షసుల్లాగే నరకాసురుడు దేవ, మానవ లోకాల్లో సంక్షోభం కలిగించాడు. నరకాసురుడిది గొప్ప జన్మ. హిర్యణ్యాక్షుడి నుంచి భూదేవిని రక్షించిన ఆది వరాహమూర్తి ఆ తల్లికి అనుగ్రహించిన వరం అతడు. వరాహ తేజస్సును కోట్ల సంవత్సరాలు గర్భంలో మోసింది భూదేవి. సత్యయుగంలో గర్భం దాలిస్తే.. త్రేతాయుగంలో కాన్పు అయింది. ఆసురీ లక్షణాలతో పుట్టాడు బిడ్డ. కొడుకు ఆలనాపాలనా జనక మహారాజుకు అప్పగించింది భూదేవి. జనకుడు తన కొడుకుతో సమానంగా నరకుడినీ పెంచాడు.
అనంతర కాలంలో అతని ఆగడాలను భరించలేక జనకుడు నరకుడిని భూదేవికి అప్పగిస్తాడు. భూదేవి విష్ణుమూర్తిని ప్రాధేయపడి ప్రాగ్జ్యోతిషపురానికి నరకుణ్ని రాజును చేస్తుంది. అయినప్పటికీ నరాకాసురుని రాక్షస చర్యలు మాత్రం ఆగలేదు. పదహారు వేలమంది రాజకన్యలను అపహరించాడు. దేవతలు సంచరించే మణిపర్వతాన్ని ఎత్తుకుపోయాడు. అమృతాన్ని స్రవించే దేవతల తల్లి దితి కుండలాలనూ లాక్కున్నాడు. మితిమీరిన కామం, అంతులేని క్రోధం, అంతకుమించిన లోభత్వం, అన్నిటికన్నా అహంతో ఇష్టారీతిగా వ్యవహరించి చీకట్లో కూరుకుపోయాడు. నరకాసురుడు వరాహస్వామి, భూదేవిల సంతానం. నరకాసురుని విష్ణుమూర్తి చంపకూడదని, తన కొడుకు తన చేతిలోనే మరణించాలని, ఎంత లోక కంటకుడు అయినప్పటికీ తన కొడుకు నరకాసురుని పేరు శాశ్వతంగా నిలిచిపోవాలని వరం పొందుతుంది భూదేవి. ఆ వరాన్ని అనుసరించి, భూదేవి, ద్వాపరయుగంలో సత్యభామగా జన్మించింది.
చెడుమార్గం పట్టిన కొడుకును ఉద్ధరించే శక్తి తల్లికే ఉంది. చీకటిలో చిక్కుకున్న నరకుడిని తీర్చిదిద్దే శక్తి భూదేవికే ఉంది. అప్పటికి ద్వాపర యుగం వచ్చేసింది. భూదేవి అంశ ద్వారకలో సత్యభామగా ఉంది. దేవతలు కృష్ణుడితో తమ బాధలు చెప్పుకొన్నారు. కృష్ణుడు కదిలాడు. శ్రీకృష్ణుడిగా నరకాసురుడిపై యుద్ధాన్ని ప్రకటించి, సత్యభామగా జన్మించిన భూదేవిని వెంటబెట్టుకుని వెళతాడు. సతీసమేతంగా యుద్ధానికి వచ్చిన కృష్ణుడిని ఎగతాళి చేసిన నరకాసురుడు, ఆమె చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. నరకుడు నేలకూలాడు. పారమార్థికంగా చూస్తే దివ్య తేజస్సు ప్రసరించడంతో అతడిని ఆవహించిన చీకటి మాయమైంది. లోక కంటకుడైన నరకుడి పీడ వదిలిందనే సంతోషంతో అంతా దీపాలు వెలిగించి మతాబులు కాల్చి సంబరాలు జరుపుకుంటారు. తరతరాలుగా ఇదే విధానం దీపావళి పండుగ పేరుతో కొనసాగుతోంది.
దీపావళి అంటే.. దీపాల వరుస. దీపాలు చీకట్లను పారద్రోలుతాయి. అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తాయి. జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తాయి. భారతీయ సంప్రదాయంలో దీపం దైవస్వరూపం. జ్ఞానానికి సంకేతం. ఆనందానికి ప్రతీక. అందుకే దీపాన్ని లక్ష్మీరూపంగా భావిస్తారు. ఆ తల్లి కటాక్షం కోసం దీపాన్ని వెలిగిస్తారు. జీవితంలో వెలుగు-నీడలు సహజం. చికాకులే చీకట్లు. సత్ప్రవర్తనతో మెలగడమే వెలుగు. చిమ్మచీకటైనా చిరుదివ్వెతో తొలగిపోతుంది. చెడు వీడితేనే మానవ జన్మకు సార్థకత. మంచి అనే దీపాన్ని వెలిగించి చెడు అనే చీకట్లను పారదోలుదాం…