పాక్‌పై పైచేయి సాధించినప్పటికీ భారత్‌ సైనిక చర్యను ఎందుకు ఆపేసింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇదే..

దాడులు కొనసాగించినా, యుద్ధం చేసినా పాక్‌ తీరు మారదు.. సుదీర్ఘకాలం పాటు దాడులు చేయడం మన ఆపరేషన్ సిందూర్ లక్ష్యం కాదు.

పాక్‌పై పైచేయి సాధించినప్పటికీ భారత్‌ సైనిక చర్యను ఎందుకు ఆపేసింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇదే..

Updated On : May 15, 2025 / 3:41 PM IST

పాకిస్థాన్‌పై పైచేయి సాధించినప్పటికీ ఆ దేశంపై సైనిక చర్యను ఎందుకు ఆపేశారంటూ కేంద్ర సర్కారుపై చాలా మంది విమర్శలు చేస్తున్నారు. అయితే, ఇటీవల జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన సమయంలో.. భారత్‌ సైనిక చర్యను ఆపింది శాశ్వతంగా కాదని, తాత్కాలికంగానే ఆపిందని అన్నారు.

భారత్ భవిష్యత్‌లో తీసుకునే కఠిన చర్యలు పాకిస్థాన్ తీరుపైనే ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు. మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు భారత్‌ వ్యూహాన్ని స్పష్టం చేసినప్పటికీ, తాత్కాలిక కాల్పుల విరమణకు మన దేశం ఎందుకు అంగీకరించిందనే ప్రశ్నలు ఇంకా చాలా మంది నుంచి వస్తున్నాయి.

త్రివిధ దళాల అధికారులు తాజాగా మీడియా సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ తాత్కాలిక కాల్పుల విరమణ కోసం అమెరికాతో పాకిస్థాన్ చర్చలు జరిపి, అగ్రరాజ్యం ద్వారా భారతదేశానికి ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. తాము భారత్‌, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు ఇప్పటికే అమెరికా కూడా పలుసార్లు చెప్పుకుంది.

గత ఆపరేషన్లకు భిన్నంగా ఆపరేషన్ సిందూర్
గతంలో యురీ, పుల్వామా ఉగ్రదాడుల తరువాత చేపట్టిన ఆపరేషన్ల కంటే ఇటీవల భారత్‌ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ భిన్నంగా ఉంది. పాకిస్థాన్ భూభాగం, పీవోకేల్లోని సరిహద్దులకు చాలా దూరంగా ఉన్న ప్రాంతాలపై భారత్‌ కచ్చితమైన రీతిలో దాడులు చేయడం ద్వారా మన దేశం ఓ సందేశాన్ని ఇచ్చింది. భారత్‌ ఇకపై చేపట్టే ఆపరేషన్లు జమ్మూకశ్మీర్‌ భౌగోళిక, రాజకీయ సరిహద్దులకు పరిమితం కావని తేల్చి చెప్పింది.

గతంలో భారత్‌ చేపట్టిన ఆపరేషన్లు పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌కు పరిమితం కావడంతో మన దేశం అనుకోకుండానే జమ్మూకశ్మీర్ ఓ వివాదాస్పద భూభాగం అనే పాకిస్థాన్ వాదాన్ని బలోపేతం చేసింది. ఇప్పుడు చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో ఆ వాదన సరికాదని భారత్‌ స్పష్టం చేసినట్లయింది.

కాల్పుల విరమణ నిర్ణయం సరైందే?
భారత్‌ సరైన నిర్ణయం తీసుకుందో లేదో నిర్ధారించుకోవడానికి ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ ఏమి సాధించడానికి ప్రయత్నిస్తుందో మనం మొదట అర్థం చేసుకోవాలి. మే 11న భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంవో) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మన దేశం చేసిన దాడుల ప్రధాన లక్ష్యాన్ని ఈ విధంగా వివరించారు.

ఆపరేషన్ సిందూర్ లక్ష్యం.. ఉగ్రదాడికి కారణమైన వారిని (దాడి చేసినవారు, ప్లాన్ వేసేవారు ఇద్దరినీ) శిక్షించడం, ఉగ్రవాద శిబిరాలు, మౌలిక సదుపాయాలను నాశనం చేయడం. కాబట్టి, భారత సైనిక చర్య చాలా పవర్‌ఫుల్‌గా, అలాగే పరిమితంగా ఉందని అర్థం చేసుకోవచ్చు.

Also Read: ‘పాపులారిటీ కోసం ఆర్టీసీ మీద పిచ్చి కామెడీ చేస్తే..’ సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు సజ్జనార్ సీరియస్ వార్నింగ్..

భారత్‌ చేపట్టింది పూర్తిస్థాయి యుద్ధం కాదు..
ఇది పూర్తిస్థాయి యుద్ధం కాదు. ఉగ్రదాడులపై తీర్చుకున్న ప్రతీకారం ఇది. పాక్‌, పీవోకేలో భారత్ దాడులు చేయడంతో పాటు పాకిస్థాన్‌పై ఇతర మార్గాల్లోనూ ఒత్తిడి తీసుకొచ్చింది. సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, రాజకీయ, దౌత్య చర్యలు తీసుకోవడం వంటివి చేసింది. ఉగ్రవాదం, ప్రాదేశిక సమగ్రతపై భారత్ తన వైఖరి గురించి పాకిస్థాన్, అంతర్జాతీయ సమాజానికి బలమైన సందేశాన్ని పంపింది.

ఆపరేషన్ సిందూర్‌లో భారత్‌ పరిమితంగా సైనిక శక్తిని వాడి మన దృఢ సంకల్పాన్ని స్పష్టం చేసింది. ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినందుకు పాకిస్థాన్‌ మూల్యం చెల్లించుకునేలా భారత్ చేసింది. పాకిస్థాన్‌ను మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. 2019లో బాలాకోట్‌లో వైమానిక దాడుల తర్వాత మళ్లీ పాకిస్థాన్‌లో సన్నగిల్లుతున్న ప్రతీకారదాడుల భయాన్ని భారత్‌ తిరిగి నింపింది.

దాడులు కొనసాగించినా, యుద్ధం చేసినా పాక్‌ తీరు మారదు
ఒకవేళ భారత్‌ మరిన్ని రోజులు పాటు సైనిక చర్యను కొనసాగించి ఉంటే లేదా పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రారంభిస్తే అప్పుడు లక్ష్యాలు వేరేలా ఉండేవి. పాకిస్థాన్ తన ఉగ్రవాద నెట్‌వర్క్‌లను విచ్ఛిన్నం చేయాలని భారత్‌ తీవ్ర ఒత్తిడి పెంచేది. ఒకవేళ యుద్ధం జరిగితే, ఆ తర్వాత జరిగే చర్చల్లో పాకిస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలను ఇవ్వాలని ఒత్తిడి చేసి వాటిని స్వాధీనం చేసుకోవడానికి భారత్ ప్రయత్నించవచ్చు.

కానీ, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే విషయంలో పాకిస్థాన్ మనస్తత్వాన్ని మాత్రం ఈ చర్య మార్చకపోవచ్చు. ఆపరేషన్ సిందూర్‌తో భారత లక్ష్యం పాకిస్థాన్‌ను శిక్షించడం, హెచ్చరించడం మాత్రమే. అంతేగానీ, పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రారంభించడం కాదు. యుద్ధం వల్ల కూడా పాకిస్థాన్‌ ఉగ్రవాదాన్ని సాధనంగా ఉపయోగించే చర్యలను మానుకోకపోవచ్చు. గతంలో పాక్‌పై వచ్చిన తీవ్ర ఒత్తిడి కూడా దాని ప్రవర్తనను మార్చలేదు.