డీఎంకేను వదిలేసి, సినీనటుడు విజయ్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు? ఎందుకంటే?

విజయ్ ప్రభావం ఇతర దక్షిణాది రాష్ట్రాలకూ విస్తరించింది. ఆయన క్రైస్తవ మతానికి చెందినవారు. కేరళలో క్రైస్తవ ఓట్ల సమీకరణకు కూడా ఇది ఉపయోగపడుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.

డీఎంకేను వదిలేసి, సినీనటుడు విజయ్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు? ఎందుకంటే?

Rahul Gandhi, Vijay, Stalin (Image Credit To Original Source)

Updated On : January 16, 2026 / 7:03 PM IST
  • కాంగ్రెస్‌ హైకమాండ్‌ చర్చలు
  • డీఎంకేను 35 సీట్లు అడుగుతున్న కాంగ్రెస్‌
  • టీవీకేతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్‌కు 60 సీట్లు!

Congress: దేశంలోని పలు రాష్ట్రాల్లో కొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై పార్టీ నేతలతో చర్చించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సమావేశాలు జరుపుతోంది. తమిళనాడు కాంగ్రెస్ సీనియర్ నేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ కీలక సమావేశంలో పాల్గొంటున్నారు. తమిళనాడులో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహాలపై రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

కాంగ్రెస్‌కు తమిళనాడులో డీఎంకేతో దాదాపు రెండు దశాబ్దాల పాటు పొత్తు కొనసాగుతోంది. అయితే, ఇప్పుడు తమిళనాడు కాంగ్రెస్‌లోని కొందరు నేతలు నటుడు విజయ్ స్థాపించిన టీవీకేతో కూటమి ఏర్పాటు చేయాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. టీవీకేతో దోస్తీ కోసం డీఎంకేకు కాంగ్రెస్ దూరం అవుతుందా? అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.

సీట్ల సర్దుబాటు, అధికార భాగస్వామ్యంపై స్తబ్దత
తమిళనాడులో కాంగ్రెస్ వంటి మిత్రపక్షాలతో డీఎంకే ఎన్నికల వరకే పొత్తు కొనసాగిస్తోంది. ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇవ్వడం లేదు. ఈ సారి మాత్రం ఎన్నికల ముందే.. పాలనలో కాంగ్రెస్ భాగస్వామ్యం కోరుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. స్టాలిన్ ప్రభుత్వంలో తమ పార్టీకి చెందిన దాదాపు ఆరుగురికి మంత్రి పదవులు కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అయితే కాంగ్రెస్‌కు క్యాబినెట్‌లో పదవులు ఇచ్చే అవకాశం లేదని డీఎంకే నేతలు స్పష్టం చేశారు.

డీఎంకే ఆఫర్ 19 సీట్లు.. కాంగ్రెస్ డిమాండ్ 35
అధికార భాగస్వామ్యంతో పాటు సీట్ల సర్దుబాటు చర్చలు కూడా విఫలమయ్యాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో భాగంగా కాంగ్రెస్‌కు 25 సీట్లు లభించాయి. వాటిలో 18 స్థానాల్లో కాంగ్రెస్‌ గెలిచింది. ఈ సారి కాంగ్రెస్‌ మరిన్ని సీట్లు ఆశిస్తోంది. అయితే, డీఎంకే కేవలం 19 సీట్లు మాత్రమే ఇవ్వగలమని అంటున్నట్లు తెలుస్తోంది.

గత ఎన్నికలను ఉదహరిస్తూ కాంగ్రెస్ ఎక్కువ సీట్లు కోరుతోంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 41… 2011లో 63… 2006లో 48 సీట్లలో పోటీ చేసింది. 2026 ఎన్నికల్లో దాదాపు 35 సీట్లలో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. మొదట 60-70 సీట్ల నుంచి చర్చలు ప్రారంభించింది. డిసెంబర్ 15 నాటికి సీట్ల ఫార్ములా ఖరారు అవుతుందని ఆశించినా, నెల గడిచినా చర్చలు ఫలించలేదు.

టీవీకే వైపు కాంగ్రెస్‌ ఎందుకు చూస్తోంది?
కాంగ్రెస్ వర్గాల ప్రకారం.. పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్‌కు 60కి పైగా సీట్లు ఇవ్వడమేగాక అధికారంలో భాగస్వామ్యం కూడా ఇస్తామని టీవీకే అంటోంది. అంతేగాక, కాంగ్రెస్ అంతర్గత సర్వే ప్రకారం టీవీకేకు దాదాపు 30 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. విజయ్ ప్రభావం దక్షిణాది ఇతర రాష్ట్రాలకూ విస్తరించింది. ఆయన క్రైస్తవ మతానికి చెందినవారు. కేరళలో క్రైస్తవ ఓట్ల సమీకరణకు కూడా ఇది ఉపయోగపడుతుందని కాంగ్రెస్ అంచనా.

విజయ్‌కు రాహుల్ గాంధీ బహిరంగ మద్దతు
ఇటీవల సెన్సార్ బోర్డు సమస్యలు, కోర్టులో పెండింగ్ కేసుతో వార్తల్లో నిలిచిన విజయ్ సినిమా “జన నాయగన్‌”కు రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. అంతకుముందు కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్‌కు రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. రాహుల్‌కు సన్నిహితుడైన కాంగ్రెస్ నేత ప్రవీణ్ చక్రవర్తి కొంతకాలం క్రితం విజయ్‌ను కలవడమేగాక డీఎంకే ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై బహిరంగంగా ప్రశ్నలు లేవనెత్తారు.

సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్‌కు అధిక సీట్లు ఇచ్చే పార్టీతో వెళ్లడం మంచిదని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొంత మంది నేతలు మాత్రం డీఎంకే వైపు మొగ్గు చూపుతున్నారు. డీఎంకేతో సీట్ల సర్దుబాటు, అధికార భాగస్వామ్యంపై రాహుల్ గాంధీ, ఖర్గే చర్చించనున్నారు. టీవీకేతో పొత్తు అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. టీవీకేపై కాంగ్రెస్ హైకమాండ్ వైఖరి ఎలా ఉండనుందన్న స్పష్టత ఈ భేటీ ద్వారా వచ్చే అవకాశం ఉంది.

కాంగ్రెస్‌కు పెద్ద సవాలే
డీఎంకేను వదిలి టీవీకేతో ప్రయోగం చేయడం కాంగ్రెస్‌కు అంత సులువు కాదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డీఎంకేపై ఒత్తిడి తెచ్చేందుకే టీవీకే కార్డును కాంగ్రెస్ ఉపయోగిస్తోంది. తమిళనాడులో కాంగ్రెస్‌కు సొంతంగా ప్రజాదరణ లేదు. జాతీయ రాజకీయాల కోణంలో కాంగ్రెస్‌కు డీఎంకే అత్యంత కీలకం. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ హైకమాండ్ డీఎంకేతో చర్చల్లో వెనక్కు తగ్గే అవకాశం ఉందన్న వాదనలు కూడా ఉన్నాయి.