Salman Khan : సల్మాన్ భాయ్.. ప్రతి రాత్రి ఫోన్ చేసి మాట్లాడతారు.. మా నాన్న మరణంతో నిద్రపోవడం లేదు : జిషాన్‌ సిద్ధిఖీ

Salman Khan : సల్మాన్ భాయ్.. ప్రతి రాత్రి ఫోన్ చేసి మాట్లాడతారు.. మా నాన్న మరణంతో నిద్రపోవడం లేదు : జిషాన్‌ సిద్ధిఖీ

Zeeshan Siddique

Updated On : October 28, 2024 / 10:54 PM IST

Zeeshan Siddique : ప్రముఖ రాజకీయ నేత బాబా సిద్ధిఖీ హత్యతో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తీవ్ర కుంగుబాటుకు గురయ్యాడని కుమారుడు జీషన్ సిద్ధిఖీ అన్నారు. ఇటీవలి ఇంటర్వ్యూలో జీషన్ సిద్ధిక్ ఈ విషయాన్ని వెల్లడించారు. సల్మాన్ ఖాన్ తమకు అత్యంత సన్నిహిత కుటుంబ మిత్రుడిగా పేర్కొన్నారు. ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో సల్మాన్ ఖాన్ తమ కుటుంబానికి అండగా నిలిచారని అన్నారు. ఇటీవలే ముంబైలో తండ్రి బాబా సిద్ధిఖీ దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే.

తండ్రి మరణంతో శోకసంద్రంలో మునిగిన తన కుటుంబానికి అన్నివేళలా అండగా నిలుస్తున్నారని చెప్పారు. ప్రతి రాత్రి తనకు ఫోన్ చేసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకునేవాడని జీషన్ సిద్ధిఖీ పేర్కొన్నారు. ఈ నెల 12న దసరా సందర్భంగా జీషన్ కార్యాలయం వెలుపల బాబా సిద్ధిక్ (66)ని దుండగులు కాల్చిచంపారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ హత్యకు బాధ్యత వహించింది. సల్మాన్ ఖాన్‌తో సన్నిహితంగా ఉండటం వల్లే ఎన్సీపీ నేత లక్ష్యంగా చేసుకున్నట్టుగా అంగీకరించారు.

తన తండ్రి మరణం తర్వాత సల్మాన్ ఖాన్‌ తన కుటుంబానికి ఎలా మద్దతునిచ్చాడో 32 ఏళ్ల జీషన్ సిద్ధిఖ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. “సల్మాన్ భాయ్.. నాన్న మరణంతో చాలా బాధపడ్డాడు. నాన్నతో సల్మాన్ భాయ్ అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. తండ్రి మరణం తర్వాత కూడా సల్మాన్ చాలా సపోర్ట్ చేశాడు. మా కుటుంబానికి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. నాన్న మరణంతో సల్మాన్ బాధతో నిద్రపోవడం లేదు. ప్రతిరోజూ రాత్రిపూట ఫోన్ చేసి నాకు ధైర్యం చెప్పేవాడు” అని జీషన్ పేర్కొన్నారు.

జీషన్ సిద్ధిక్ గత వారమే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ వర్గంలో చేరారు. జీషన్‌ను వాండ్రే ఈస్ట్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ప్రకటించారు. మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారనే ఆరోపణలతో ఆగస్టులో కాంగ్రెస్ నుంచి బహిష్కరించారు. ఈ అభియోగాన్ని ఆయన గతంలోనే తోసిపుచ్చారు.

Read Also : Vidya Balan Diet : డైట్ సీక్రెట్ రివీల్ చేసిన నటి విద్యా బాలన్.. 45ఏళ్ల వయస్సులో ఎలా బరువు తగ్గానంటే?