Telangana Elections 2023 : చుక్క మీ ఇంట్లో.. ముక్క మా ఇంట్లో – ఎన్నికల సిత్రాలు

ఓ పక్కన ఎన్నికలు..మరోపక్కన శుభకార్యాలు ఉంటే ఇటువంటి విచిత్రాలు కనిపిస్తాయో అనేదానికి నిదర్శనంగా ఓ కుటుంబం ఆహ్వానించిన తీరు చర్చనీయాంశంగా మారింది. తమ ఇంట్లో జరిగే శుభకార్యానికి ఆహ్వానించిన తీరు భలే గమ్మత్తుగా ఉంది.

Telangana Elections 2023 : చుక్క మీ ఇంట్లో.. ముక్క మా ఇంట్లో – ఎన్నికల సిత్రాలు

Liquor bottle with invitation card

Telangana : ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ నేతల సిత్రాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నికల ప్రచారాలు చేస్తు..రోడ్ల పక్కన ఉండే షాపులోను..ఫుడ్ సెంటర్లను విచిత్ర విన్యాసాలు చేస్తుంటారు. ఓ నేత దోశలు వేస్తే మరో నేత బట్టలు ఇస్త్రీ చేసేస్తు తెగ సందడి చేసేస్తుంటారు.మరొకరు చంటిపిల్లల్ని ఎత్తేసుకుని తెగ ముద్దు చేసేస్తుంటారు. ఇంకొకరు టీ షాపుల్లో టీలు కాచి కష్టమర్లకు సర్వ్ చేసి ఓటు మాకే వేయండీ అంటూ లౌక్యంగా ముచ్చట్లు పెట్టేస్తుంటారు. ఇలాంటి సిత్రాలు..విచిత్ర విన్యాసాలకు ఎన్నికల ప్రచారంలో లోటే ఉండదు. చూసిన వారికి చూసినంత వినోదం పంచేస్తు నేతలు రకరకాల అవతారాలు ఎత్తుతుంటారు.

ఇదిలా ఉంటే ఓ పక్కన ఎన్నికలు..మరోపక్కన శుభకార్యాలు ఉంటే ఇంకెన్నీ విచిత్రాలు కనిపిస్తాయో అనేదానికి నిదర్శనంగా హైదరాబాద్ నగరంలోని ఓ ప్రాంతంలో ఓ కుటుంబంలో జరిగిన ఓ శుభకార్యానికి వారు వ్యవహరించిన తీరు తాజాగా చర్చనీయాంశంగా మారింది. దీనికి గురించి వింటే వార్నీ..ఎన్నికల పుణ్యమా అంటూ ఇటువంటి వింత వింత ఆలోచనలు కూడా చేయొచ్చన్నమాట అనుకునేలా ఉంది.

గులాబీ దూకుడు.. ఒకేరోజు సీఎం కేసీఆర్ నాలుగు సభలు, కేటీఆర్ నాలుగు రోడ్ షోలు

ఇంతకీ ఏమా సిత్రం అంటే..ఖైరతాబాద్ లో నివసిస్తున్న ఓ కుటుంబంలో ఓ శుభకార్యం జరిగాల్సి ఉంది. అదీకూడా ఆదివారం జరగాల్సి ఉంది. మరి విందు అంటు ముక్కా (నాన్ వెజ్) చుక్కా(మద్యం) ఉండాల్సిందేకదా..మరి ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో విందులో ముక్క పెట్టగలం గానీ..చుక్క మాత్రం ఇవ్వలేం అనుకున్న సదరు కుటుంబం ముందు చూపు (మందు చూపు) తో వినూత్నంగా ఆలోచించింది.

సదరు శుభకార్యానికి ఇచ్చే ఆహ్వాన పత్రికతో పాటు మద్యం బాటిల్ కూడా ఇచ్చింది. ఈ సందర్భంగా సదరు కుటుంబం చుక్క మీ ఇంటిలో వేసుకుని ముక్క తినటానికి మా ఇంటికి రండి అంటూ మరీ పిలిచింది. ఎందుకంటే తీరా వచ్చాక విందులో ముక్కలు పెట్టి చుక్క ఇవ్వలేదని ఆత్మీయులు, బంధు మిత్రులు అలుగుతారని ఇలా ముందు చూపుతో అదేనండీ ‘మందు చూపు’తో శుభకార్యానికి ఇచ్చే ఆహ్వాన పత్రికతో పాటు ఓ మద్యం బాటిల్ కూడా పైగా వారికి నచ్చిన బ్రాండ్ మద్యం బాటిల్ ఇచ్చి మరీ శుభకార్యానికి తప్పనిసరిగా రావాలని పిలిచింది. దీంతో ఆహ్వాన పత్రికతో పాటు మద్యం బాటిల్ కూడా ఇచ్చిన ఈ కుటుంబం ముందు చూపు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.