అనంతపురం టీడీపీలో హైటెన్షన్‌.. లోక్‌సభ వద్దు అసెంబ్లీ ముద్దు అంటున్న ఆ ఇద్దరు

జిల్లాలో కీలకమైన ఇద్దరు బీసీ నేతలు పార్లమెంట్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపకపోవడంతో టీడీపీ తర్జనభర్జన పడుతోందని అంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో టీడీపీ-జనసేన పార్లమెంట్‌ అభ్యర్థుల ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం ఉన్నందున..

అనంతపురం టీడీపీలో హైటెన్షన్‌.. లోక్‌సభ వద్దు అసెంబ్లీ ముద్దు అంటున్న ఆ ఇద్దరు

High Tension In Anantapuram TDP

Updated On : February 3, 2024 / 8:54 PM IST

Anantapur TDP Politics : అధికార పార్టీలో టికెట్ల ప్రకటనతో అసంతృప్తులు బయటపడుతుంటే.. ప్రతిపక్ష టీడీపీలో ఇంకా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దశలోనే.. అసంతృప్తి రాజుకుంటోంది. అభ్యర్థుల ఎంపిక, టికెట్ల కేటాయింపుపై పార్టీ ఎలాంటి ప్రకటన చేయకున్నా.. మీడియాలో జరుగుతున్న ప్రచారంతోనే తీవ్రంగా రియాక్ట్‌ అవుతున్నారు నేతలు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు ఎంపీ సీట్లకు అభ్యర్థులు ఖరారయ్యారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ ఇద్దరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తీవ్ర అసంతృప్తిలో ఆ ఇద్దరు నేతలు..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇందులో ఒకటి అనంతపురం కాగా, మరొకటి హిందూపురం.. ఈ రెండు సీట్ల నుంచి ఇద్దరు బీసీ నేతలను పోటీకి పెట్టాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. గత ఎన్నికల్లో అనంతపురం నుంచి పోటీచేసిన జేసీ దివాకర్‌రెడ్డి కుమారుడు పవన్‌కుమార్‌ రెడ్డికి ఇదే విషయం తేల్చిచెప్పింది అధిష్టానం. దీంతో బీసీ నేతలను బరిలోకి దింపడం పక్కా అన్న విషయం తేలిపోయింది. అయితే పార్టీ పరిశీలనలో బీసీ నేతలు అయిన కాల్వ శ్రీనివాసులు, బీకే పార్థసారథి పేర్లు ఉన్నట్లు కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతుండటంతో.. ఆ ఇద్దరు నేతలు అసంతృప్తి చెందుతున్నారని చెబుతున్నారు.

Also Read : టీడీపీ గుంటూరు ఎంపీ టికెట్‌ ఎవరికి? సీటు కోసం ఆ ఇద్దరు ప్రముఖుల పోటీ

అనంతపురం పార్లమెంట్‌ అభ్యర్థిపై ఉత్కంఠ..
అనంతపురం పార్లమెంట్‌కు కాల్వ శ్రీనివాసులు, హిందూపురం లోక్‌సభ అభ్యర్థిగా బీకే పార్థసారథిని నిలుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. కాల్వ శ్రీనివాసులు బోయ సామాజిక వర్గం నేత కాగా, బీకే పార్థసారథి కురబ సామాజికవర్గానికి చెందిన వారు. ఈ ఇద్దరినీ పార్లమెంట్‌ బరిలో నిలిపితే బీసీలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చినట్లు అవుతుందని టీడీపీ ఆలోచిస్తుందని చెబుతున్నారు. అయితే కాల్వ శ్రీనివాసులు ఈ ప్రచారాన్ని కొట్టిపడేస్తున్నారు. గతంలో రాయదుర్గం ఎమ్మెల్యేగా పనిచేసిన కాల్వ శ్రీనివాసులు.. మళ్లీ అదేసీటును ఆశిస్తున్నారు. అధిష్టానం కూడా తనకు రాయదుర్గం సీటు ఇస్తానని హామీ ఇచ్చిందని ఆయన చెబుతుండటంతో అనంతపురం పార్లమెంట్‌ అభ్యర్థిపై ఉత్కంఠ ఏర్పడుతోంది.

రాయదుర్గం టికెట్ రేసులో దీపక్ రెడ్డి, పూలనాగరాజు..
అయితే తాను రాయదుర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కాల్వ శ్రీనివాసులు చెబుతుండటం పార్టీ ధిక్కారస్వరంగా ఆయన వ్యతిరేక వర్గం ప్రచారం చేస్తోంది. కాల్వ శ్రీనివాసులు ఆశిస్తున్న రాయదుర్గం అసెంబ్లీకి సీనియర్‌ నేత దీపక్‌రెడ్డి పేరుతోపాటు పూల నాగరాజు అనే నేత పేరు పరిశీలిస్తున్నారంటున్నారు. ఎంపీగా పోటీకి కాల్వ విముఖత ప్రదర్శిస్తే.. రాయదుర్గం సీటుకు తీవ్ర పోటీ ఉన్నట్లే భావిస్తున్నారు.

పెనుకొండ టీడీపీ అభ్యర్థిని నేనే అని ప్రకటించేశారు..
ఇక హిందుపురం లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్న బీకే పార్థసారథి కూడా విముఖంగా ఉన్నారంటున్నారు. ప్రస్తుతం హిందూపురం పార్లమెంట్‌ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న పార్థసారథి పెనుగొండ అసెంబ్లీ సీటును ఆశిస్తున్నారు. ఇదే సీటును కురబ సామాజికవర్గానికి చెందిన మహిళా నేత సవిత ఆశిస్తున్నారు.

వైసీపీ కూడా ఈ నియోజకవర్గం నుంచి మహిళా నేత, మంత్రి ఉషశ్రీ చరణ్‌ను రంగంలోకి దింపుతోంది. కురబ సామాజిక వర్గానికి చెందిన మంత్రి ఉషశ్రీపై అదే సామాజికవర్గానికి చెందిన నేతను పోటీకి పెట్టాలని టీడీపీ ఆలోచిస్తోంది. అయితే తాను కురబ సామాజికవర్గానికి చెందిన నేతను కనుక తనకే చాన్స్‌ ఇవ్వాలని.. తనకు పార్లమెంట్‌కు పోటీచేసే ఆలోచన లేదని పార్థసారధి చెబుతుండటంతో అధిష్టానంపై ఒత్తిడి పెరుగుతోంది.

Also Read : టీడీపీ-జనసేన కూటమితో పొత్తు లేనట్టేనా? ఏపీ ఎన్నికల్లో వ్యూహం మార్చిన బీజేపీ..! కారణం అదేనా?

జిల్లాలో కీలకమైన ఇద్దరు బీసీ నేతలు పార్లమెంట్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపకపోవడంతో టీడీపీ తర్జనభర్జన పడుతోందని అంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో టీడీపీ-జనసేన పార్లమెంట్‌ అభ్యర్థుల ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం ఉన్నందున.. అంతవరకు ఈ రెండు సీట్లపై ఉత్కంఠ కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది.