జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలకు జగన్ గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్దం అవుతోంది. హైకోర్టులో దాఖలైన పిల్ విచారణ జరుగుతుండగా.. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు జనవరిలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. జనవరిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని మంత్రులకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై గురువారం(13 నవంబర్ 2019) హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయబోతుంది.
రాజకీయంగా ఈ ఎన్నికలకు అధికార పార్టీ సిద్దం అవుతోంది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేపట్టింది. గత ఎన్నికల్లో అమలు చేసిన రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో 59.85 శాతం కోటాను అమలు చేయగా.. అందు కోసం కోర్టును ఒప్పించాలని అందుకు తగ్గట్లుగా వాదించాలని ప్రభుత్వం చెబుతోంది. ఇక హైకోర్ట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే, ఎన్నికలు జనవరిలో నిర్వహించేందుకు జగన్ మంత్రులకు సూచించారు. దీనిపై ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకుంది.
2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగగా ఆ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసిలకు 62.03శాతం రిజర్వేషన్లు అమలయ్యాయి. అయితే 2014లో రాష్ట్ర విభజన కావడంతో రిజర్వేషన్ల శాతం 59.85 శాతంకు పరిమితమైంది. అయితే రెండేళ్ల కిందట సుప్రీం కోర్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు యాభై శాతంకు మించరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో బీసీల రిజర్వేషన్‌ను కుదించవలసిన పరిస్థితి.
సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం జగన్.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సమీక్షలో భాగంగా ఈ మేరకు మంత్రులకు సూచనలు చేశారు. పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖలు ఎన్నికల నిర్వహణకు అవసరమైన వార్డుల విభజన, బీసీ జనాభా గణనను పూర్తి చేశాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉంది. సార్వత్రిక ఎన్నికలు గెలిచిన ఊపులోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆధిపత్యం సాధించేలా యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి మంత్రులకు సూచించారు.