Pawan Kalyan : పవన్ కల్యాణ్ వేట.. గెలుపు గుర్రాల ఎంపిక కోసం స్వయంగా రంగంలోకి, ముందుగా అక్కడి నుంచే

జిల్లాలో 6 నుంచి 8 స్థానాలు కోరుతోంది జనసేన. ఈ స్థానాల్లో కచ్చితంగా గెలవాలన్నదే పవన్ టార్గెట్. అందుకే ఏయే స్థానాల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయో..? ఆ స్థానాలనే తీసుకోవాలని భావిస్తున్నారు జనసేనాని.

Pawan Kalyan : పవన్ కల్యాణ్ వేట.. గెలుపు గుర్రాల ఎంపిక కోసం స్వయంగా రంగంలోకి,  ముందుగా అక్కడి నుంచే

Pawan Kalyan In Hunt Of MLA Candidates

జనసేనాని పవన్‌ కల్యాణ్ స్పీడ్ పెంచుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని ఓడించాలని టార్గెట్ పెట్టుకున్న పవన్.. ముందుగానే జనసేన అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెడుతున్నారు. ముందుగా పార్టీకి మంచి హోల్డ్ ఉన్న ఉభయ గోదావరి జిల్లాల్లో బలమైన అభ్యర్థుల అన్వేషణ స్టార్ట్ చేశారు పవన్. ముందుగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని మూడు పార్లమెంట్ సీట్ల పరిధిలో గెలుపు గుర్రాలను జల్లెడ పట్టేందుకు కాకినాడలో అడుగుపెట్టారు పవన్‌కల్యాణ్.

గెలుపు గుర్రాల కోసం.. స్వయంగా రంగంలోకి పవన్
జనసేనాని పవన్‌ కల్యాణ్ వేట మొదలు పెట్టారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బలమైన అభ్యర్థుల ఎంపికకు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు పవన్. మూడు రోజుల పాటు కాకినాడలో పర్యటిస్తున్న పవన్.. మూడు జిల్లాల పరిధిలోని 21 అసెంబ్లీ సీట్లలో జనసేన బలాబలాలపై ఆరా తీయనున్నారు. పొత్తులో భాగంగా పార్టీకి పరిమిత సీట్లే అందుబాటులో ఉండే అవకాశం ఉన్నందున.. ఎక్కడెక్కడ బలమైన క్యాడర్ ఉంది? ఏ స్థానంలో పోటీ చేస్తే.. గెలుపు పక్కా.. అనే అంశాలపై కార్యకర్తల అభిప్రాయాలను సేకరించనున్నారు పవన్..

కాకినాడ జిల్లాలో జనసేనకు గట్టి పట్టు..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 6 నుంచి 8 స్థానాలు కోరుతోంది జనసేన. ఈ స్థానాల్లో కచ్చితంగా గెలవాలన్నదే పవన్ టార్గెట్. అందుకే ఏయే స్థానాల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయో..? ఆ స్థానాలనే తీసుకోవాలని భావిస్తున్నారు జనసేనాని. నియోజకవర్గాల వారీగా లెక్కలు వేసుకుంటూ.. అభ్యర్థులపైనా క్లారిటీకి రావాలని నిర్ణయించారని తెలుస్తోంది. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో జనసేనకు గట్టి పట్టు ఉంది. ఈ జిల్లాలో ప్రభావం చూసే కాపు సామాజికవర్గం ఓట్లు జనసేనకు లాభించే అవకాశం ఉందనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో ఓ పార్లమెంట్ సీటుతోపాటు రెండు ఎమ్మెల్యే టికెట్లు తీసుకోవాలని భావిస్తోంది జనసేన పార్టీ.

Also Read : వైఎస్ షర్మిల టీడీపీకి దగ్గర అవుతున్నారా? జగన్ సోదరి వ్యూహం ఏంటి?

కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేనకు క్యాడర్ పటిష్టంగా ఉంది. ఈ సీటును పంతం నానాజి ఆశిస్తున్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కురసాల కన్నబాబు కూడా కాపు సామాజిక వర్గం నేతే కావడంతో.. ఇక్కడ బీసీ ఓట్లు కీలకంగా మారాయి. మరోవైపు బీసీ నేత పిల్లి అనంత లక్ష్మీ టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఈ సీటు నుంచి ఏ పార్టీ పోటీ చేయాలో కాకినాడ పర్యటనలోనే తేల్చేయనున్నారు పవన్.

కాకినాడ సిటీ సీటు కోసం పోటీ..
ఇక కాకినాడ సిటీపైనా జనసేనలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాకినాడ సిటీ సీటును మాజీ ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణ కుమారుడు ముత్తా శశిధర్ కోరుతున్నారు. ప్రముఖ అడ్వకేటు తోట సుధీర్ పేరు వినిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో మత్స్యకారుల ఓట్లు ఎక్కువగా ఉండటంతో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పోటీకి సై అంటున్నారు. ఈ రెండు సీట్లలో టీడీపీతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు పవన్.

రాజమండ్రి రూరల్, రాజానగరంపై జనసేన కన్ను..
ఇక రాజమండ్రి కేంద్రంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోనూ రాజమండ్రి రూరల్, రాజానగరం నియోజకవర్గాలపై కన్నేశారు జనసేన నేతలు. రాజమండ్రి రూరల్ నుంచి మాజీ ఎమ్మెల్యే కందుల దుర్గేశ్ టికెట్ ఆశిస్తుండగా.. ఇది టీడీపీ సిట్టింగ్ సీటు.. పైగా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఎలా సర్దుబాటు చేస్తారనేది సస్పెన్స్‌గా మారింది. ఇక్కడి నుంచి వైసీపీ తరఫున మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ పోటీ చేయనున్నారనే చెబుతున్నారు. రాజానగరంలో జనసేన నేత బత్తుల బలరామకృష్ణ ప్రజల్లో విస్తృతంగా తిరుగుతూ పార్టీని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లారు. ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో టీడీపీ ఈ సీటును వదులుకుంటుందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

Also Read : ఏపీలో ఈసారి గెలుపు ఎవరిది? టీడీపీ ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏవి?

రాజోలు సీటు కోసం ఆ ఇద్దరి పోటీ..
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన చాలా బలంగా తయారైంది. గత ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిచిన ఏకైక సీటు రాజోలు కోనసీమ జిల్లాలోనే ఉంది. ఈ సీటును మళ్లీ తీసుకోవాలని ఆశిస్తోంది జనసేన. ప్రముఖ వైద్యుడు రాపాక రమేశ్ గ్లాసు గుర్తుపై పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసి ఓడిన బొంతు రాజేశ్వరరావు చాలా కాలం క్రితమే జనసేనలో చేరారు. టికెట్ ఆశతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి పవన్ ఆశీస్సులు లభిస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

ఎక్కడెక్కడ నుంచి జనసేన పోటీ చేస్తుంది?
అమలాపురంలో కూడా జనసేనకు గట్టిపట్టు ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన శెట్టిబత్తుల రాజబాబు మళ్లీ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఎంపీగా పోటీ చేసిన డీఎంఆర్ శేఖర్ కూడా ఇదే సీటు ఆశిస్తున్నారు. రామచంద్రపురం, మండపేట, కొత్తపేట నియోజకవర్గాల్లోనూ జనసేన పోటీ చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా పవన్ పర్యటనతో ఉమ్మడి జిల్లాలో ఎక్కడెక్కడ నుంచి జనసేన పోటీ చేస్తుంది? ఎవరికి చాన్స్ దక్కనుందనేది తేలిపోనుందని ఆశిస్తున్నారు జనసైనికులు.