ఉద్యోగులు, జర్నలిస్టులకు ఇళ్ల స్ధలాలు : రంగంలోకి మంత్రుల కమిటీ

అమరావతి : ఏపీ సీఎం జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో భాగంగా అర్హులైన వారికి ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, హై కోర్టు న్యాయవాదులు, పేద ప్రజలు, పూజార్లు, ఇమామ్ లు, పాస్టర్లు, జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్ధలాలు పంపిణీ చేయనుంది.
ఇందుకు సంబంధించి విధివిధానాలు రూపోందించటానికి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చైర్మన్ గా ముగ్గురు మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రులు బొత్స సత్యనారాయణ , బుగ్గన రాజేంద్రనాధ్, పినిపే విశ్వరూప్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
మరోవైపు…ఉగాది పండుగ రోజున ఇళ్లు లేని వారికి ఇంటి పట్టాలను అందజేస్తా మని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం అన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నవరత్న పథకాలను అమలు చేసేందుకు వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని బొత్స ఉద్ఘాటించారు.