బాలినేనిపై సీఎం జగన్ సీరియస్..!

గత 6 నెలల నుంచి వివిధ కారణాలతో బాలినేని అలకబూనడం, తర్వాత తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలిపించడం, మాట్లాడటం జరిగాయి. ఆ తర్వాత మళ్లీ ఏదో ఒక ఇష్యూ తీసుకురావడం..

బాలినేనిపై సీఎం జగన్ సీరియస్..!

CM Jagan Serious On Balineni Srinivasa Reddy

Updated On : January 30, 2024 / 7:03 PM IST

Balineni Srinivasa Reddy : మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి మరోసారి అలకపూనారు. ఒంగోలు ఎంపీ స్థానం మాగుంటకు ఇవ్వాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నారు. మాగుంటకు టికెట్ ఇవ్వకపోతే తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని అధిష్టానానికి తెలిపారు బాలినేని ఇప్పటికే. చాలాసార్లు సీఎం జగన్ తో బాలినేని సమావేశమై చర్చించారు. ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంటకు ఇచ్చేది లేదని బాలినేనికి సీఎం జగన్ తేల్చి చెప్పారు. మరోసారి బాలినేనితో సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. బాలినేని వ్యవహారంపై అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

చాలాకాలంగా వైసీపీలో బాలినేని వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారిందని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. గత 6 నెలల నుంచి వివిధ కారణాలతో బాలినేని అలకబూనడం, తర్వాత తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలిపించడం, మాట్లాడటం జరిగాయి. ఆ తర్వాత మళ్లీ ఏదో ఒక ఇష్యూ తీసుకురావడం, అలకపూనడం.. ఇదే తీరు కొనసాగుతోంది.

Also Read : రాజ్యసభ రేసులో టీడీపీ? టచ్‌లో 30మంది వైసీపీ ఎమ్మెల్యేలు?

తాజాగా ఇంఛార్జ్ ల మార్పులకు సంబంధించి మరోసారి బాలినేని అలకపూనారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంటకు లేదా ఆయన కుమారుడికి టికెట్ ఇవ్వాలని మొదటి నుంచి కూడా బాలినేని అధిష్టానాన్ని పట్టుబడుతున్నారు. దాంతో పాటు తనకు ఒంగోలు సిటీకి సంబంధించిన ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారు. ఈ రెండింటిపై బాలినేని మొదటి నుంచి పట్టుబడుతున్నారు. దీంతో పాటు జిల్లాలో కొన్నిచోట్ల తన అనుచరులకు టికెట్లు ఇవ్వాలని బాలినేని అడుగుతున్నారు. అయితే అధిష్టానం మాత్రం పట్టించుకోలేదు.

ఇక మాగుంట విషయానికి సంబంధించి కూడా సీఎం జగన్ తోనూ, అలాగే ఇంఛార్జ్ గా ఉన్న విజయసాయిరెడ్డితోనూ అనేకసార్లు బాలినేని సమావేశం అయ్యారు. సీఎం జగన్ కూడా ఆయనకు చాలా క్లారిటీ ఇచ్చారు. మాగుంటకు టికెట్ తప్ప మిగతా ఏ విషయమైనా అడగాలని చాలాసార్లు బాలినేనికి సీఎం జగన్ చెప్పారు. దీంతో పాటు నియోజకవర్గంలో కొన్ని సమస్యలు, నిధుల విడుదల, ఇళ్ల పట్టాల వ్యవహారం.. ఇవన్నీ క్లియర్ అయిపోయాయి. దీంతో తాను చాలా ఆనందంగా ఉన్నాను అంటూ 4రోజుల క్రితం బాలినేని ప్రకటించారు.

రెండు రోజుల క్రితం మాగుంటతో బాలినేని సమావేశం అయ్యారు. అప్పటి నుంచి మాగుంటకే ఎంపీ టికెట్ ఇవ్వాలని ఆయన అధిష్టానాన్ని మరోసారి కోరుతున్నారు. నిన్న బాలినేని తాడేపల్లికి వెళ్లి విజయసాయిరెడ్డిని కలిసి ఒంగోలు ఎంపీ టికెట్ విషయమై చర్చించారు. ఎంపీ టికెట్ మాగుంటకే ఇవ్వాలని బాలినేని పట్టుబట్టారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇస్తారని అధిష్టానం చెబుతున్నా.. బాలినేని ససేమిరా అంటున్నారు. ఒంగోలుకు మాగుంటే ఉండాలి, మాగుంట పోటీ చేస్తేనే నేను కూడా పోటీ చేస్తాను లేదంటే నాకు కూడా ఫోన్ చేయొద్దు అంటూ అధిష్టానానికి బాలినేని చెబుతున్నట్లు సమాచారం.

కాగా, ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంటకు ఇచ్చేది లేదని బాలినేనికి సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పినట్లు సమాచారం. అయితే, బాలినేని మాత్రం తగ్గేది లేదంటున్నారు. మాగుంటకే టికెట్ ఇవ్వాలని బాలినేని పట్టుబడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సీఎం జగన్ చాలా సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. ప్రతీసారి ఏదో ఒక ఇష్యూ తీసుకురావడం, అలకబూనడం.. బాలినేనికి సాధారణమైపోయిందని పార్టీలోని కీలక నేతలు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి. ఒంగోలు పార్లమెంటుకు సంబంధించి అధిష్టానం క్లారిటీ ఇచ్చేసిన తర్వాత కూడా బాలినేని పట్టుబడటం కరెక్ట్ కాదంటున్నారు వైసీపీ నేతలు.

Also Read : వైసీపీలో మార్పుల మంటలు.. మంత్రి పెద్దిరెడ్డిపై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు