క్లారిటీ వచ్చింది : టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీళ్లే

  • Published By: veegamteam ,Published On : March 13, 2019 / 03:00 PM IST
క్లారిటీ వచ్చింది : టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీళ్లే

ఏపీ టీడీపీ ఎంపీ అభ్యర్థుల అంశం కొలిక్కి వస్తోంది. దశలవారీగా కసరత్తు చేసిన చంద్రబాబు ఒకొక్కరిగా అభ్యర్ధుల ఎంపిక పూర్తి చేస్తున్నారు. ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులు దాదాపుగా ఖరారైనట్లే. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారు ఎంపీలుగా వెళ్లేందుకు కాస్త వెనకాడినప్పటికీ చంద్రబాబు వారిని సముదాయించారు.

లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు. మంత్రి శిద్ధా రాఘవరావును ఒంగోలు నుంచి బరిలోకి దింపాలని భావించిన చంద్రబాబు ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడారు. దర్శి నుంచే పోటీకి శిద్ధా ఆసక్తి చూపినప్పటికీ చంద్రబాబు నచ్చచెప్పారు. మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు ఒంగోలు లేదా నెల్లూరు నుంచి పోటీకి సై అన్నారు. ఒంగోలు నుంచి శిద్ధా అభ్యర్థిత్వం ఖరారు కావడంతో నెల్లూరు నుంచి మస్తాన్ రావు బరిలో నిలిచే అవకాశం ఉంది. రాజమహేంద్రవరం నుంచి సిట్టింగ్ ఎంపీ మురళీమోహన్ పోటీకి విముఖత చూపడంతో ఆయన కోడలు రూపను బరిలోకి దింపాలని చంద్రబాబు నిర్ణయించారు.

తిరుపతి లోక్ సభకు మాజీ మంత్రి పనబాక లక్ష్మీ పేరు దాదాపుగా ఖరారైంది. పనబాక లక్ష్మీ, కృష్ణయ్య దంపతులు టీడీపీ తీర్థం పుచ్చుకుంటారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కృష్ణయ్య కోరుతున్నారు. పనబాక లక్ష్మికి తిరుపతి ఎంపీ సీటుపై హామీ ఇచ్చినప్పటికీ ఎమ్మెల్యే సీటుపై మాత్రం హామీ ఇవ్వలేదు. విజయనగరం నుంచి అశోక గజపతిరాజు, ఏలూరు నుంచి మాగంటి బాబు, చిత్తూరు నుంచి శివప్రసాద్ కు మరోసారి అవకాశం కల్పించబోతున్నారు.

అమలాపురం నుంచి లోక్ సభ మాజీ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీష్ మాధుర్ పేరు ప్రచారంలో ఉండగా ఇప్పుడు కొత్తగా మాజీ ఎంపీ హర్ష కుమార్ పేరు తెరపైకి వచ్చింది. హర్షకుమార్ ఇప్పటికే ముఖ్యమంత్రిని కలిశారు. రాజంపేట స్ధానానికి కేంద్ర మాజీమంత్రి సాయి ప్రతాప్, చిత్తూరు ఎమ్మెల్యే డి.కె.సత్యప్రభ పేర్లు పరిశీలిస్తున్నారు. ఎంపీ రాయపాటి సాంబశివరావు నర్సరావుపేట నుంచి బరిలోకి దిగుతున్నారు. తన కుమారుడు రంగారావుకు సత్తెనపల్లి అసెంబ్లీ సీటు కేటాయించాలని పార్టీ అధినేతను కోరినట్లు రాయపాటి చెబుతున్నా దానిపై క్లారిటీ లేదు. నంద్యాల సీటుపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సీటులో పోటీకి ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఎంపీ ఎస్పీవై రెడ్డి ఈసారి తన కుమార్తెకు లోక్ సభకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. ఇటు పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారధిరెడ్డి కూడా పోటీకి ఆసక్తిగా ఉన్నారు.

మంత్రి గంటా శ్రీనివాసరావు అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. విశాఖ లోక్ సభ నుంచి ఆయనతో పోటీ చేయాలని భావించినా ఆయన అంత ఆసక్తిని చూపలేదు. కర్నూలు ఎంపీ బుట్టా రేణుకకు ఆదోని ఎమ్మెల్యే టిక్కెట్ కేటాయించే అవకాశం ఉంది. మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తన తనయుడు విజయ్ కు నర్సీపట్నం నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరారు. అది కుదరకపోతే అనకాపల్లి ఎంపీ స్ధానానికైనా విజయ్ పేరును పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.