ఏపీలో 25 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు

ఆంధ్రప్రదేశ్ లో 25 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల పై అధికారులతో సమీక్షించ నిర్వహించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక కేంద్రం చొప్పున 25 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, ఒక యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. తిరుపతిలో స్కిల్‌డెవలప్‌మెంట్ యూనివర్శిటీ, విశాఖపట్నంలో హైఎండ్ స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని సీఎం అధికారులకు సూచించారు. దీనివల్ల ఏం జరుగుతోందన్న దానిపై ఒక అవగాహన ఉంటుందని…సమీక్షించడం, పర్యవేక్షించడం సులభతరం అవుతుందని ఆయన చెప్పారు. అవినీతికి ఆస్కారం లేకుండా వీటిని ఏర్పాటు చేయాలని అన్నారు. స్కిల్ డెవలప్‌సెంటర్లలో ఏ అంశాలపై శిక్షణ ఇవ్వాలన్నదానిపై స్కిల్స్ యూనివర్శిటీ నిర్ణయిస్తుందని తెలిపారు.
ఒక్కో పార్లమెంటు నియోజక వర్గానికి ఒక పాలిటెక్నిక్ కాలేజీగాని లేదా అవసరమైతే రెండు కాలేజీలనుగాని తీసుకునే ఆలోచనలు చేయాలని, ఎంపిక చేసుకున్న ఈపాలిటెక్నిక్ కాలేజీని నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా మార్చాలని ఆయన అన్నారు. ఏయే కేంద్రాల్లో ఏ తరహా శిక్షణ దొరుకుతుందన్నదానిపై విద్యార్థులకు, పూర్తిస్థాయి అవగాహన ఉంటుందన్నారు. వివిధ సాంకేతి కోర్సులను నేర్చుకున్నవారికి మరింత నైపుణ్యాన్ని వీటిద్వారా కలిగించాలని, ఇంజినీరింగ్ అయిపోయిన, డిప్లమో పూర్తిచేసిన, ఐటీఐ లాంటి కోర్సులను పూర్తిచేసిన వారికి వారి నైపుణ్యాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ఈ స్కిల్స్ యూనివర్శిటీ, స్కిల్స్ కేంద్రాలు ఉపయోగపడేలాచర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లలో మంచి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసి..మంచి బోధకులను రప్పించాలని…నైపుణ్యాభివృద్ధికోసం ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలతో అనుసంధానం కావాలని జగన్ చెప్పారు. స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణా కేంద్రం చూసి ఉద్యోగం ఇచ్చేలా అభ్యర్ధులకు శిక్షణ ఇవ్వాలన్నారు. స్థానిక పరిశ్రమలు, వారి అవసరాలను గుర్తించి ఆ మేరకు శిక్షణ ఇవ్వండి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో అక్కడున్న స్థానిక పరిశ్రమల ప్రతినిధులను బోర్డులో సభ్యులుగా చేర్చండి. హైఎండ్ స్కిల్స్‌కోసం కూడా మరో యూనివర్శిటీని తీసుకురావాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయ పడ్డారు.
రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి స్కిల్స్‌ను ఇక్కడ నేర్పించేందుకు అధికారులు ప్రణాళికను తయారుచేయాలని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న నైపుణ్యభివృద్ధి కార్యక్రమాలపై పూర్తిస్థాయి సమీక్ష చేసి.. వీటి ద్వారా నిజంగా పిల్లలు లబ్ధి పొందుతున్నారా? లేక మాటలకు మాత్రమే పరిమితం అవుతుందా? అన్నది పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారు. 2100 చోట్ల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అధికారులు వివరించగా వీటిపై పూర్తిస్థాయి పరిశీలన చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.